కుంగుబాటుతో ఫ్రెంచ్ ఓపెన్(French Open 2021) మధ్యలోనే నిష్క్రమించి.. ఆ తర్వాత వింబుల్డన్‌కూ దూరమైన జపాన్ స్టార్ నవోమి ఒసాకా (Naomi Osaka) ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ టోర్నీలో (US Open 2021) ఘనంగా పునరాగమనం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఒసాకా 6-4, 6-1తో మారీ బొజ్‌కోవాపై (చెక్ రిపబ్లిక్) నెగ్గింది.
తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్న ఒసాకా.. రెండో సెట్లో దూకుడుగా ఆడి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ఆమె మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసింది. చెక్ స్టార్ కరోలినా ప్లిస్కోవా రెండో రౌండ్ చేరింది. ఈ నాలుగో సీడ్ 6-3, 6-4తో మాక్‌నాలీని (అమెరికా) ఓడించింది. అమెరికా అమ్మాయిలు స్లోన్ స్టీఫెన్స్, కొకో గాఫ్ మూడు సెట్ల మ్యాచ్‌లు ఆడి గట్టెక్కారు. స్లోన్ 6-3, 1-6, 7-6 (9/7)తో కీస్పై (అమెరికా) గెలవగా, గాఫ్ 5-7, 6-3, 6-4తో లినెట్‌ను (పోలెండ్) ఓడించింది.
18వ సీడ్ విక్టోరియా అజరెంకా 6-4, 6-0తో మార్టిన్‌కోవాపై (చెక్ రిపబ్లిక్) విజయం సాధించగా.. జర్మనీ తార కెర్బర్ 3-6, 6-4, 7-6 (7/3)తో యెస్‌రెమ్‌స్కాపై (ఉక్రెయిన్) కష్టపడి నెగ్గింది. స్వితోలినా (ఉక్రెయిన్), సినియోకోవా (చెక్ రిపబ్లిక్), సకారి (గ్రీస్), మార్టిచ్ (క్రొయేషియా), జంగ్ (చైనా), సబలెంక (బెలారస్), కనేపి (ఇస్తోనియా), జబెర్ (ట్యూనీసియా) రెండో రౌండ్ చేరుకున్నారు.
ముర్రే తొలి రౌండ్లోనే..: పురుషుల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే(Andy Murray) తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. నాలుగు గంటలకు పైగా హోరాహోరీగా జరిగిన సమరంలో ఈ బ్రిటన్ స్టార్ 6-2, 6-7 (7/9), 6-3, 3-6, 4-6తో సిట్సిపాస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి మూడు సెట్లలో రెండు సెట్లు గెలిచి జోరు మీద కనిపించిన ముర్రే.. ఆ తర్వాత గాడి తప్పి ఓటమిపాలయ్యాడు. రష్యా కుర్రాడు డానియల్ మెద్వెదెవ్ రెండో రౌండ్లో ప్రవేశించాడు. ఈ రెండో సీడ్ 6-4, 6-3, 6-1తో గాస్కెట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఈ పోరులో 15 ఏస్‌లు కొట్టిన మెద్వెదెవ్.. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియా స్టార్ కిర్గియోస్ ఓడిపోయాడు. అతడు 3-6, 4-6, 0-6తో బటిస్టా అగట్ (స్పెయిన్) చేతిలో పరాజయం చవిచూశాడు. అయిదో సీడ్ రుబ్‌లెవ్ (రష్యా), పదకొండో సీడ్ ష్వార్జ్‌మ్యాన్ (అర్జెంటీనా), దిమిత్రోవ్ (బల్గేరియా), కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) తొలి రౌండ్ దాటారు.
ఇదీ చూడండి: US Open 2021: జకోవిచ్ ఈ టోర్నీలోనూ గెలిస్తే చరిత్రే!