రోజురోజుకు కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా. ఆటల నిర్వహణ వల్ల కలిగే నష్టాల గురించి విస్తృతమైన చర్చ అవసరమని ఆమె పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒలింపిక్స్ అవసరమా అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది.
"ఒలింపిక్స్ జరగాలని నేను కోరుకుంటున్నాను. కరోనా నేపథ్యంలో గత సంవత్సర కాలంగా చాలా మార్పులు జరిగాయి. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొవిడ్.. ప్రజలను అసౌకర్యానికి గురిచేస్తుంది. ఒలింపిక్స్ నిర్వహణ వల్ల ప్రజా జీవితం ప్రమాదంలో పడుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి దీనిపై చర్చ అవసరం."
-నవోమి ఒసాకా, టెన్నిస్ క్రీడాకారిణి.
"గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్ కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. ఈ సారి కూడా ఆటల నిర్వహణపై జపాన్ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దేశంలో కేవలం 2 శాతం ప్రజలు మాత్రమే టీకా తీసుకున్నారు. అయినప్పటికీ.. నిర్ణీత తేదీ ప్రకారమే ఆటలు ప్రారంభించాలని స్థానిక నిర్వాహకులతో పాటు ఒలింపిక్ కమిటీ పట్టుబడుతున్నాయి" అని ఒసాకా తెలిపింది.
ఒలింపిక్స్ కారణంగా జపాన్లోకి చాలా మంది రాబోతున్నారని ఒసాకా తెలిపింది. కాబట్టి ఇక్కడి ప్రజలు మరింత సురక్షితంగా ఉండాలని అభిప్రాయపడింది. ఇప్పటికే తాను టీకా తీసుకున్నట్లు వెల్లడించింది. వ్యాక్సినేషన్ కోసం ఏ ఒక్కరినీ బలవంత పెట్టలేమని తెలిపింది.
ఇదీ చూడండి: నాదల్, ఒసాకాను వరించిన ప్రతిష్ఠాత్మక లారస్ అవార్డు