వచ్చే ఏడాది జనవరి (18 నుంచి 31 వరకు)లో జరగాల్సిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఒకటి లేదా రెండు వారాలు ఆలస్యంగా ఆరంభమయ్యే అవకాశం ఉందని విక్టోరియా రాష్ట్ర క్రీడా మంత్రి మార్టిన్ వెల్లడించాడు. ప్రభుత్వంలోని వివిధ స్థాయి అధికారులతో, టెన్నిస్ ప్రతినిధులతో కొనసాగుతున్న చర్చలు ముగింపు దశకు చేరుకుంటున్నాయని అతను స్పష్టం చేశాడు. ఏడాదిలో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ జరగడం మాత్రం ఖాయమని, కానీ ఆలస్యంగా నిర్వహించే వీలుందని చెప్పాడు.
"ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వహణ తేదీలపై చర్చ కొనసాగుతోంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ టోర్నీ ఒకటి లేదా రెండు వారాలు ఆలస్యంగా ఆరంభమయ్యే వీలుంది. కానీ అదొక్క మార్గమే లేదు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కొన్ని నెలలు వాయిదా తర్వాత జరిగిందని, వింబుల్డన్ ఓపెన్‌నూ పూర్తిగా రద్దుచేశారు. ఆ విధంగా చూసుకుంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ మాత్రం సుదీర్ఘ కాలం వాయిదా పడే అవకాశం లేదు. ఆటగాళ్ల క్వారంటైన్ గురించి కూడా చర్చ సాగుతోంది. ఆటగాళ్లు తమ దేశాల నుంచి టోర్నీ కోసం బయల్దేరే ముందు, ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత, అలాగే టోర్నీ మధ్యలోనూ వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తాం."
- మార్టిన్, విక్టోరియా రాష్ట్ర క్రీడామంత్రి
విక్టోరియాలో రెండోసారి వ్యాపిస్తున్న కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మళ్లీ లాక్‌డౌన్ విధించారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ తేదీలపై స్పష్టత కొరవడింది.