యూఎస్ ఓపెన్(US Open) మహిళల సింగిల్స్‌లో 19 ఏళ్ల కెనడా అమ్మాయి లీలా ఫెర్నాండెజ్(Leylah Fernandez Tennis) సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఒసాక, కెర్బర్‌ను ఓడించిన ఆమె.. తాజాగా అయిదో సీడ్ స్వితోలినాకు క్వార్టర్స్‌లో షాకిచ్చింది. 2005 తర్వాత ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన పిన్న వయసు క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఆమె 6-3, 3-6, 7-6 (7-5) తేడాతో స్వితోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ర్యాంకింగ్స్‌లో తనకంటే మెరుగైన క్రీడాకారిణులను ఓడించి క్వార్టర్స్ చేరుకున్న ఈ అన్‌సీడెడ్ అమ్మాయి.. స్వితోలినాతో మ్యాచ్‌లోనూ అదే పోరాటాన్ని కొనసాగించింది. పదునైన సర్వీసులు, వేగవంతమైన రిటర్న్‌లతో అదరగొట్టింది. కోర్టులో చురుగ్గా కదులుతూ ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టింది.
మరో క్వార్టర్స్‌లో రెండో సీడ్ సబలెంక (బెలారస్) 6-1, 6-4తో క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తుచేసింది. ఈ పోరులో ఆరు ఏస్‌లు సంధించిన ఆమె(Sabalenka US Open 2021).. 22 విన్నర్లు కొట్టింది. సెమీస్‌లో ఫెర్నాండెజ్‌తో సబలెంక పోటీపడుతుంది. బ్రిటన్‌కు చెందిన ఎమ్మా రదుకాను కూడా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో ఆమె 6-3, 6-4తో బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించింది. రదుకాను 6 ఏస్‌లు, 23 విన్నర్లు కొట్టింది.
మెద్వెదెవ్ జోరు: కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకునే దిశగా రష్యా కుర్రాడు మెద్వెదెవ్(Medvedev Tennis) మరో అడుగు ముందుకేశాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ఈ రెండో సీడ్ ఆటగాడు సెమీస్ చేరాడు. క్వార్టర్స్‌లో అతను 6-3, 6-0, 4-6, 7-5తో బొటిక్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. మరో క్వార్టర్స్‌లో అగర్ (కెనడా).. కార్లోస్ (స్పెయిన్)పై నెగ్గాడు. మ్యాచ్‌లో అగర్ 6-3, 3-1తో ఆధిక్యంలో ఉన్న సమయంలో గాయంతో ప్రత్యర్థి తప్పుకోవడంతో విజయం అతని సొంతమైంది.