యూనివర్స్ బాస్ క్రిస్ గేల్.. శనివారం తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. రిటైర్మెంట్పై గేల్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకున్నా.. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ఔటై వెనుదిరిగే సమయంలో అతడికి సహచరుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. అంతేకాక అభిమానులకు, ఇతర సిబ్బందికి ఆటోగ్రాఫ్ ఇస్తూ కనిపించాడు గేల్. ఈ మ్యాచ్‌లో 9 బంతుల్లో 15 పరుగులు చేశాడు గేల్.
రెండు ప్రపంచకప్‌ల వీరుడు..
1999లో అరంగేట్రం చేసిన గేల్.. వెస్టిండీస్ రెండుసార్లు ప్రపంచకప్ గెలవడంలో కీలకంగా ఉన్నాడు. సుదీర్ఘ కాలంగా తనతో పాటు ఆడుతూ ఇటీవలే రిటర్మైంట్ ప్రకటించిన డ్వేన్ బ్రావోతో తన ఆఖరి మ్యాచ్ ఆడటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు గేల్. బ్రావోకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే.
గేల్.. 79 అంతర్జాతీయ టీ20ల్లో 1899 పరుగులు చేశాడు. అందులో 14 అర్ధ శతకాలున్నాయి. ఇక టీ20 కెరీర్లో మొత్తం 445 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 14, 321 పరుగులు చేశాడు. 22 సెంచరీలు బాదాడు. అందులో 2013లో ఆర్సీబీ తరఫున 66 బంతుల్లోనే 175 పరుగులు చేయడం ఇప్పటికీ ప్రపంచ రికార్డుగా ఉంది.
విండీస్‌కు కెప్టెన్‌గానూ చేసిన గేల్.. 2014 నుంచి టెస్టులు ఆడటం లేదు. వన్డేల్లో 2019లో చివరిసారిగా కనిపించాడు. 103 టెస్టుల్లో 7214 పరుగులు, 301 వన్డేల్లో 10,480 పరుగులు చేశాడు ఈ విండీస్ వీరుడు.