టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) భాగంగా అబుదాబి వేదికగా జరుగుతోన్న మ్యాచులో ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగారు. దీంతో బంగ్లాదేశ్(ENG vs BAN t20) మోస్తరు స్వల్ప పరుగులకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో టైమల్ మిల్స్ మూడు, మొయిన్ అలీ రెండు, లివింగ్ స్టోన్ రెండు, క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లుగా బరిలోకి దిగిన లిటన్ దాస్ (9), మహమ్మద్ నయీమ్ (5) విఫలమయ్యారు. మొయిన్ అలీ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి లిటన్ దాస్.. లివింగ్ స్టోన్‌కి చిక్కగా, మూడో బంతికి నయీమ్.. క్రిస్ వోక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన షకీబ్-అల్-హసన్ (4) కూడా ఆకట్టుకోలేకపోయాడు. క్రిస్ వోక్స్ వేసిన ఆరో ఓవర్లో అదిల్ రషీద్‌కి చిక్కి క్రీజు వీడాడు. దీంతో పవర్ ప్లే ముగిసే లోపే మూడు కీలక వికెట్లు కోల్పోయి.. బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీమ్, మహమ్మదుల్లా (19) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే లివింగ్ స్టోన్ వేసిన 11వ ఓవర్లో రహీమ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 15వ ఓవర్లో మహ్మదుల్లా క్రిస్ వోక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మెహెదీ హసన్ (11), అఫీఫ్ హొస్సేన్ (5) ఆకట్టుకోలేకపోయారు. ఆఖర్లో వచ్చిన నురుల్ హసన్ (16), నసూమ్ అహ్మద్ (19) ధాటిగా ఆడటంతో బంగ్లాదేశ్ మోస్తరు పరుగులు చేయగలిగింది.
ఇదీ చదవండి: