ఒలింపిక్స్ మహా సంగ్రామం రాబోతోందంటే.. కొందరు స్టార్ అథ్లెట్ల ప్రదర్శన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు అభిమానులు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి అలరిస్తున్న కొందరు మేటి అథ్లెట్లు విశ్వ క్రీడలకు దూరమయ్యారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు ఉసేన్ బోల్ట్‌దే. గత మూడు పర్యాయాలూ ఒలింపిక్స్‌కు అతి పెద్ద ఆకర్షణ అతనే. 100, 200 మీ. పరుగు పందేలకు తిరుగులేని ఆకర్షణ తీసుకొచ్చి ఆ కొన్ని క్షణాలు ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులందరూ ఊపిరి బిగబట్టి చూసేలా చేసిన ఘనత అతడిదే. వయసు ప్రభావం, ఫిట్‌నెస్ సమస్యలతో 2017లో ఇక చాలనిపించేశాడు ఈ జమైకా యోధుడు.
బోల్ట్‌తో పాటు గాట్లిన్, కోల్‌మన్ లాంటి పరుగు వీరులు లేకపోవడమూ నిరాశ కలిగించేదే. గాట్లిన్ అర్హత సాధించలేకపోగా.. కోల్‌మన్ నిషేధం ఎదుర్కొంటున్నాడు. ఇక ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యధిక పతకాల వీరుడైన అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్‌ను కూడా ఇకపై విశ్వక్రీడల్లో చూడలేం. అతనూ రిటైరపోయాడు. సుదూర పరుగుకు ఆకర్షణ అయిన బ్రిటన్ అథ్లెట్ మో ఫరా.. టోక్యో క్రీడలకు అర్హత సాధించలేకపోయాడు.
ఒలింపిక్స్‌లో టెన్నిస్ ఎన్నడూ లేనంతగా ఈసారి కళ తప్పనుంది. ఫెదరర్, నాదల్, సెరెనా లాంటి అగ్రశ్రేణి క్రీడాకారులు టోక్యోకు రాలేదు. ఇక మన క్రీడాకారుల్లో టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్.. షూటర్లు అభినవ్ బింద్రా, గగన్ నారంగ్‌ల ఒలింపిక్స్ ప్రస్థానమూ ముగిసింది. 1996 నుంచి నిర్విరామంగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న పేస్.. రియోతో తన విశ్వక్రీడల ప్రస్థానాన్ని ముగించేశాడు. 2000 నుంచి ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్న బింద్రా.. 2004 నుంచి బరిలో నిలుస్తున్న నారంగ్‌లిద్దరూ రియోలోనే ముగించేశారు.
ఇవీ చదవండి: