టోక్యో ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐఓసీ) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు స్వాగతించారు. ఈ విషయమై భారత అథ్లెట్లు ఎటువంటి నిరాశ చెందొద్దని అన్నారు.
"కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ను ఐఓసీ వాయిదా వేయాలనే తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లకు ఇది ఎంతో శ్రేయస్కరం. భారత అథ్లెట్లు నిరాశచెందొద్దు. 2021లో భారత్ ఎక్కువ పతకాలను సాధించేలా అవకాశాలు సృష్టిస్తాం" -కిరణ్ రిజుజు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి
కరోనా ప్రభావంతో ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ను వాయిదా వేశారు. షెడ్యూలు ప్రకారం జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహించాలి. కానీ ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్, జపాన్ ప్రధాన మంత్రి షింజో అబె మధ్య టెలిఫోన్లో చర్చల అనంతరం, వారు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.