ప్రేమకు అవధులు లేవని.. అది ఎప్పుడు, ఎలా పుడుతుందో చెప్పలేమని అంటుంటారు. అందుకు నిదర్శనం.. సానియా మీర్జా- షోయబ్ మాలిక్, పెంటేల హరికృష్ణ- నదెడ్జా జోడీలు. దేశాలు దాటిన వీళ్ల ప్రేమ.. పెళ్లిగా మారింది. భారత టెన్నిస్ తార సానియా, పాకిస్థాన్ క్రికెటర్ మాలిక్ 2004లో తొలిసారి హోబర్ట్‌లోని ఓ రెస్టారెంట్లో కలుసుకున్నారు. ఆ తర్వాత సానియా మ్యాచ్ చూడడానికి అతను స్టేడియానికి వెళ్లాడు. అలా వాళ్ల ప్రయణ గాథ మొదలై పెళ్లికి దారితీసింది. మరోవైపు తెలుగు గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణ, సెర్బియా మహిళల ఫిడే మాస్టర్ నదెడ్జాల ప్రేమ కథ ఖండాల మధ్య దూరాలనే చెరిపేసింది. జూనియర్ స్థాయి టోర్నీల్లో ఆడేటప్పుడే వీళ్ల మధ్య పరిచయం మొదలైంది. 2018లో వివాహం జరిగింది.
క్రికెటర్లు.. అలా!
భారత్‌లో స్క్వాష్ పేరు వినగానే ముందు గుర్తొచ్చే దీపిక పల్లికల్ ఓ వైపు. భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ మరోవైపు. వీళ్ల ఆటకు అసలు కొద్దిగా కూడా సంబంధం లేదు. కానీ వీళ్ల మనసులు మాత్రం అనుబంధాన్ని కోరుకున్నాయి. వీళ్లిద్దరూ ఒకే ఫిట్‌నెస్ కోచ్ దగ్గర శిక్షణ తీసుకోవడం వల్ల పరిచయం మొదలైంది. 2013లో టీమ్‌ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే ఆమెకు దినేశ్ తన ప్రేమను తెలిపాడు. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. 2015లో ఈ జంట పెళ్లి చేసుకుంది.
టీమ్‌ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ కూడా ఓ క్రీడాకారిణినే పెళ్లి చేసుకున్నాడనే విషయం చాలా మందికి తెలీదు. అతని భార్య ప్రతిమ సింగ్ బాస్కెట్‌బాల్ ప్లేయర్. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. 2016లో వీళ్లు వివాహంతో ఒక్కటయ్యారు.
'గురి' కుదిరింది..
అగ్రశ్రేణి ఆర్చర్లుగా ఎదిగి.. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతోన్న దీపికా కుమారి, అతాను దాస్‌ల గురి కుదిరి.. జోడీగా మారింది. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించిన ఈ జంట.. మంగళవారం పెళ్లి పీటలు ఎక్కబోతుంది. టోక్యో ఒలింపిక్స్ తర్వాతే వివాహం చేసుకుంటామని 2018లో నిశ్చితార్థం చేసుకున్నపుడు ప్రకటించిన వీళ్లు.. కరోనా కారణంగా ఆ మెగా క్రీడలు ఏడాది పాటు వాయిదా పడడం వల్ల పెళ్లికి సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ ఇద్దరు ఆ ఒలింపిక్స్ కోటా స్థానాలను దక్కించుకున్నారు. 2008లో జంషెడ్‌పుర్‌లోని టాటా ఆర్చరీ అకాడమీలో వీళ్లు తొలిసారిగా కలుసుకున్నారు. తర్వాత ప్రేమలో పడి పెళ్లి వైపు అడుగులేశారు.
ఆ విందు కలిపింది
భారత స్ప్రింట్ దిగ్గజం మిల్కాసింగ్ దాంపత్య జీవితం వెనుక ఓ క్రీడాకారిణిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్న కథ ఉంది. అతని భార్య నిర్మల కౌర్ అప్పట్లో జాతీయ మహిళల వాలీబాల్ జట్టు కెప్టెన్. 1955లో కొలంబోలో ఓ టోర్నీ కోసం వీళ్లిద్దరూ వెళ్లారు. ఆమె వాలీబాల్ జట్టుకు సారథ్యం వహిస్తుండగా.. మిల్కాసింగ్ అథ్లెటిక్స్ జట్టులో ఉన్నాడు. అక్కడ ఓ వ్యాపారవేత్త ఇచ్చిన విందులో తొలిసారిగా కలిశారు. మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. వాళ్ల పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పడం వల్ల కలిసి జీవిద్దామనే నిర్ణయానికి వచ్చారు. కానీ అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ మధ్యలో కలగజేసుకుని.. రెండు కుటుంబాలకు నచ్చజెప్పి 1962లో వాళ్ల పెళ్లి చేయించాడు.
బ్యాడ్మింటన్, రెజ్లింగ్‌లోనూ..
బ్యాడ్మింటన్‌లో ప్రేమతో ఒక్కటైన పెళ్లి జంటల సంఖ్య ఎక్కువే. కోర్టులో స్మాష్‌లతో విరుచుకుపడే ఆ షట్లర్లు ప్రేమలోనూ జోరు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ భార్య లక్ష్మి ఒకప్పటి షట్లరే. దేశం తరపున కలిసి ఆడిన వీళ్లు.. జీవితంలోనూ కలిసే జీవిస్తున్నారు. అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్.. ప్రేమ పక్షులన్న సంగతి తెలిసిందే. ఈ జంట 2018లో పెళ్లి చేసుకుంది. డబుల్స్ షట్లర్లు సిక్కిరెడ్డి, సుమీత్ రెడ్డి గతేడాది వివాహ బంధంతో ఒకటయ్యారు.
రెజ్లింగ్‌లోనూ జంటలు చాలానే ఉన్నాయి. వినేశ్ ఫొగాట్, సోమ్‌వీర్.. 2018లో పెళ్లి చేసుకున్నారు. సాక్షి మాలిక్ 2017లో తోటి రెజ్లర్ సత్యవర్త్‌ను వివాహమాడింది. గీత ఫొగాట్ 2016లో మరో రెజ్లర్ పవన్ కుమార్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. బబితా ఫొగాట్- వివేక్ సుహాగ్, సరిత మోర్- రాహుల్ మన్ జోడీలు ఈ జాబితాలోకే వస్తాయి. దిగ్గజ లాంగ్‌జంప్ అథ్లెట్ అంజూ బాబీ జార్జ్ సైతం.. ట్రిపుల్ జంప్‌లో మాజీ జాతీయ ఛాంపియన్ రాబర్ట్ బాబీని పెళ్లి చేసుకుంది.