Isha Shooting: భారత షూటింగ్ సంచలనం ఇషా సింగ్ మరోసారి అదరగొట్టింది. ఈ తెలంగాణ టీనేజీ షూటర్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి పసిడి సొంతం చేసుకుంది. శనివారం జూనియర్ మహిళల 25మీ. పిస్టల్ విభాగంలో ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. పతక పోరులో 29 పాయింట్లు సాధించిన ఆమె.. చైనా షూటర్ ఫెంగ్ సిజుయాన్ (25)ను వెనక్కినెట్టింది. అర్హత రౌండ్లో 581 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచిన 17 ఏళ్ల ఇషా.. ర్యాంకింగ్ మ్యాచ్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. తుది పోరులో నిలకడగా లక్ష్యానికి గురి పెట్టి స్వర్ణం కైవసం చేసుకుంది.
గతేడాది ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె రెండు రజతాలు గెలిచింది. ఈ సారి ఇప్పటికే 25మీ. పిస్టల్ టీమ్ విభాగంలో ఆమె జట్టు కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. 10మీ. పిస్టల్ విభాగంలోనూ పోటీలో ఉన్న ఆమె మరో పతకం గెలవాలనే ధ్యేయంతో ఉన్నట్లు కైరో నుంచి చెప్పింది. "ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చైనా షూటర్లు నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. పతక పోరులో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా తలపడ్డా" అని ఆమె పేర్కొంది. మరోవైపు ఉదయ్‌వీర్ జూనియర్ పురుషుల 25మీ, స్టాండర్డ్ పిస్టల్ టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. సమీర్ కాంస్యం నెగ్గాడు.
ఇవీ చదవండి: T20 World Cup: బరిలో 16 దేశాలు.. సూపర్ అనిపించేదెవరో?