Boxer Nikhat world championships: ఇటీవల స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో పసిడి గెలిచి జోరుమీదున్న తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌కు ఎంపికైంది. స్ట్రాంజా టోర్నీ చరిత్రలో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి భారత బాక్సర్‌గా నిలిచిన ఈ 25 ఏళ్ల అమ్మాయి.. మే 6న ఇస్తాంబుల్‌లో ఆరంభమయ్యే మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 52 కేజీల విభాగంలో బరిలో దిగుతుంది. సెలక్షన్ ట్రయల్స్‌లో ఆమె 7-0తో మీనాక్షిను(హరియాణా) చిత్తుచేసింది.
మరోవైపు టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా 70 కేజీల విభాగంలో పోటీపడేందుకు అర్హత సాధించింది. ట్రయల్స్‌లో అరుంధతిని ఓడించిన ఆమె టోక్యో క్రీడల తర్వాత పోటీపడే తొలి టోర్నీ ఇదే. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నేరుగా తలపడేలా లవ్లీనాకు అవకాశం ఇవ్వడంపై అరుంధతి దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మనీష (57 కేజీలు), జాస్మిన్ (60), సవీటీ (75) ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌తో పాటు ఆసియా క్రీడలకూ అర్హత సాధించారు. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లోనూ ఈ మూడు విభాగాలు ఉండడమే అందుకు కారణం. మిగతా రెండు ఆసియా క్రీడల విభాగాల (51, 69 కేజీలు)కు శుక్రవారం నుంచి ట్రయల్స్ నిర్వహిస్తారు.
నిరుడు డిసెంబర్‌లో జరగాల్సిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. 12 విభాగాల్లోనూ పోటీపడేందుకు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఇప్పుడు బాక్సర్లను ట్రయల్స్ ద్వారా ఎంపిక చేసింది. జులైలో ఆరంభమయ్యే కామన్వెల్త్ క్రీడలకు సన్నద్ధమవడం కోసం దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌తో పాటు ఆసియా క్రీడలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
ఇదీ చూడండి: చిన్నప్పటి స్కూల్లో రహానే.. జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ..