భారత క్రీడారంగంలో గొప్పగా వెలిగిన క్రీడాకారుల్లో ముందు వరుసలో ఉండే ఆటగాడు సుశీల్ కుమార్. ఈ దిగ్గజ రెజ్లర్ సాధించిన ఘనతలు ఎన్నో. వరుసగా రెండు ఒలింపిక్స్ (2008 బీజింగ్-కాంస్యం, 2012 లండన్-రజతం) పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు. అలాంటి ఆటగాడు కొంత కాలంగా కెరీర్‌ను చక్కదిద్దుకోలేక ఇబ్బంది పడుతున్నాడు.
ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్వహించే ట్రయల్స్‌కు దూరమయ్యాడు సుశీల్. చేతికి గాయం కావడం వల్ల తను బరిలో దిగనున్న 74 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం పోటీలను వాయిదా వేయాలని కోరాడు. అందుకు డబ్ల్యూఎఫ్ఐ తిరస్కరించింది. ఫలితంగా నేడు జరగనున్న ఈ పోటీలకు అతడు అందుబాటులో ఉండట్లేదు. అయితే మార్చిలో మళ్లీ తన అదృష్టం పరీక్షించుకునే అవకాశం ఉంది. ఈ ట్రయల్స్‌ను పురుషుల ఫ్రీస్టయిల్లో ఐదు విభాగాల్లో, గ్రీక్-రోమన్ స్టయిల్లో 6 విభాగాల్లో నిర్వహించనున్నారు.
వరుసగా టోర్నీలు...
ఈ ట్రయల్స్ గెలిచిన వాళ్లు ఈ ఏడాది పలు టోర్నీల్లో పాల్గొననున్నారు. ఫస్ట్ ర్యాంకింగ్ సిరీస్(జనవరి 15-18), ఆసియా ఛాంపియన్షిప్(ఫిబ్రవరి 18-23), ఆసియన్ ఒలింపిక్ క్వాలిఫయర్(మార్చి 27-29) మ్యాచ్‌ల్లో క్రీడాకారులు తలపడనున్నారు.
ఇప్పటికే పురుష రెజ్లర్లలో.. రవి దహియా(57 కేజీలు), బజరంగ్ పునియా(65 కేజీలు), దీపక్ పునియా(86 కేజీలు), మహిళల్లో వినేశ్ ఫొగాట్(53 కేజీలు) ఇప్పటికే ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. శనివారం మహిళల ట్రయల్స్ నిర్వహించనున్నారు.