దాదాపు పదేళ్ల తర్వాత భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్య (జీఎఫ్ఐ)ను జాతీయ క్రీడా సమాఖ్య(ఎన్ఎస్ఎఫ్)గా గుర్తింపును పునరుద్ధరించింది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ గుర్తింపు అమల్లో ఉంటుంది. జీఎఫ్ఐలో అంతర్గత కలహాల కారణంగా 2011లో దాని గుర్తింపు రద్దైంది.
గుర్తింపుతో పాటు 2019-2023 కాలానికి జీఎఫ్ఐ అధ్యక్షుడిగా సుధీర్ మిట్టల్, కోశాధికారిగా కౌశిక్ బిడివాలా ఎన్నికను ధ్రువీకరించింది కేంద్రం. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శాంతి కుమార్ సింగ్ పదవిపై మణిపూర్ హైకోర్టు ఉత్తర్వుల తర్వాత నిర్ణయిస్తామని సుధీర్‌కు పంపిన లేఖలో చెప్పింది.
నిబంధనలు పాటిస్తేనే..
జాతీయ క్రీడా సమాఖ్యలకు ఏటా గుర్తింపు ఇస్తుంటుంది క్రీడల శాఖ. 2011 క్రీడా స్మృతిలోని నిబంధనలు తప్పకుండా పాటిస్తేనే జీఎఫ్‌ఐకి గుర్తింపు కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సిబ్బంది నియామకం జరగాలని, జీఎఫ్ఐలో రాజ్యంగ మార్పునకు కనీసం రెండు నెలల ముందు నోటీసు ఇవ్వాలని తెలిపింది. షరతులను ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఇదీ చూడండి: స్ట్రాంజా బాక్సింగ్ సెమీస్‌లో దీపక్ సంచలనం