భారత మహిళా అథ్లెట్లకు 2019 సంవత్సరం మంచి ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి. సంవత్సరాంతంలో భారత అథ్లెట్ రోమా షా 'ప్రపంచ రా పవర్ లిఫ్టింగ్' ఛాంపియన్‌షిప్ పోటీల్లో నాలుగు పతకాలను గెలుచుకోవటమే ఇందుకు నిదర్శనం. గుజరాత్ సూరత్‌కు చెందిన రోమా ఈ పోటీల్లో రెండు పసిడి, రెండు రజత పతకాలను గెలుచుకుంది. రష్యాలోని మాస్కోలో జరిగిన ఈ పోటీల్లో రోమా సోదరుడు అభిషేక్ కూడా కాంస్య పతకాన్ని గెలుచుకోవటం విశేషం.
ఈ విజయంపై రోమా షా సంతోషం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో మరిని పతకాలు సాధిస్తానని చెబుతోంది.
‘‘నేను కంప్యూటర్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. మొదట నేను రకరకాల క్రీడలను ఆడేదాన్ని. అనంతరం రా పవర్‌లిఫ్టింగ్ ఎంచుకున్నాను. గత మూడేళ్లుగా అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటున్నాను. 22 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో భారత మహిళల తరఫున నేను ఒక్కదానినే ప్రాతినిధ్యం వహించాను.’’
- రోమా షా, అథ్లెట్
కళాశాలలో మరే ఇతర విద్యార్థిని కూడా స్వీకరించటానికి సాహసించని పవర్‌లిఫ్టింగ్‌ను తమ కుమార్తె ఎంచుకున్నందుకు గర్వంగా ఉందని రోమా తల్లి దీపా షా అన్నారు. ఈ క్రీడలో రాణించటానికి రోమా ఎంతగానో శ్రమించిందని ఆమె తెలిపారు.
రోమా మొదట పూర్తి శాకాహారిగా ఉండేదట. కానీ క్రీడలలో శరీర దారుఢ్యం కోసం మాంసాహారాన్ని కూడా తీసుకోవటం మొదలు పెట్టింది.
ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రోమా ఎదుర్కొన్న కష్టనష్టాలను ఆమె కోచ్ యాసన్ భెసానియా తెలిపారు.
‘‘ఈ సంవత్సరం ప్రపంచ రా పవర్ లిఫ్టింగ్ పోటీ అతి కఠినంగా ఉంది. మహిళల్లో పోటీ మరింత తీవ్రంగా ఉంది. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో జరిగే ఈ పోటీలు.. ఈ సంవత్సరం డిసెంబర్‌లో జరిగాయి. మైనస్ 6 డిగ్రీల అతి తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏ అథ్లెట్‌కైనా ప్రదర్శన అంత సులభం కాదు. ఇక భారత్ వంటి ఉష్ణదేశాల వారికి మరీ కష్టం అవుతుంది. మా విమానం ఆలస్యం కావటం వల్ల మేము పోటీకి కేవలం 24 గంటల ముందు మాత్రమే అక్కడికి చేరుకోగలిగాము. రోమా తన బరువును నియంత్రణలో ఉంచుకోవటం కూడా మాకు సవాలుగా పరిణమించింది. అయినా తన క్రమశిక్షణ, దీక్ష, నిరంతర సాధనతో రోమా గొప్ప ఫలితాలను సాధించి దేశానికి కీర్తిని సంపాదించి పెట్టింది’’
-యాసన్ భెసానియా, కోచ్.