ఈ ఏడాదిగానూ ప్రతిష్టాత్మక 'ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను బీబీసీ ప్రకటించింది. ఇందులో భారత మహిళ హాకీ జట్టు సారథి రాణి రాంపాల్, చెస్ ప్లేయర్ కోనేరు హంపీ, యువ షూటర్ మను బాకర్ ఉన్నారు. ఈ రేసులో మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్, స్ప్రింటర్ ద్యుతి చంద్ కూడా ఉన్నారు.
విజేతను ఎలా ప్రకటిస్తారు?
ఫిబ్రవరి 24న ఓటింగ్ ప్రారంభంకానుంది. అభిమానులు బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లలో దేనికైనా వెళ్లి నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాలోని తమకు నచ్చిన క్రీడాకారిణికి ఓటు వేయవచ్చు. అత్యధిక ఓట్లు పొందిన క్రీడాకారిణి 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని సొంతం చేసుకుంటుంది. ఈ విజేతలను ఎంపిక చేసేందుకు బీబీసీ ఓ జ్యూరీని రూపొందించింది. ఆ జ్యూరీలో దేశంలోని కొందరు ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలు ఉన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు విజేతను ప్రకటిస్తారు.
అయితే ఈ ఏడాది పురస్కారం అందించడంలో భాగంగా 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' పేరుతో మరో కొత్త కేటగిరీని ప్రవేశపెట్టింది బీబీసీ. అయితే ఇందులో విజేతలను ఓటింగ్ ద్వారా కాకుండా కేవలం జ్యూరీలోని సభ్యులు ఎంపిక చేస్తారు.
ఎందుకీ అవార్డు
భారత ఉత్తమ మహిళా క్రీడాకారుల (పారా అథ్లెట్లు సహా) సేవలను గుర్తించేందుకు, మరింత ఎక్కువ మంది మహిళలు, యువత ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు బీబీసీ మొదటిసారిగా ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారాన్ని 2019లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ అవార్డు ప్రదానోత్సవం కొనసాగుతోంది.
ఇదీ చూడండి : 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా పంత్