ఇండియాలో బాక్సింగ్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు 'మేరీ కోమ్'(mary kom news latest). మహిళ అయినాసరే ఆమె సాధించిన ఘనతలు చూస్తే ఎవరైనా ప్రశంసించాల్సిందే. పేదరికంలో పుట్టి.. ప్రపంచంలోనే అత్యుత్తమ బాక్సర్‌గా పేరు సంపాదించుకోవడం అంటే మాటలా? దీనిని మేరీకోమ్ చేసి చూపించింది. ఈమె ఉన్నత శిఖరాలకు సునాయాసంగా చేరుకుందని ఎవరైనా అనుకుంటే.. అది పొరపాటే. ఈ దిగ్గజ బాక్సర్ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో. కష్టాల కడలిని ఎదురీదుతూ.. ముందుకు సాగిన మేరీ కోమ్ జీవితం.. ఈ తరం యువతకు ఆదర్శం.
పొలంలో పని నుంచి బాక్సింగ్ రింగ్ వరకు..
మేరీకోమ్ పూర్తి పేరు.. మాంగ్తే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్. మణిపుర్‌లోని ఓ మారుమూల గ్రామంలో 1982 నవంబర్ 24న జన్మించి. ఆమె తల్లిదండ్రులు సాధారణ రైతులు. ఆమెకు ఓ సోదరి, ఓ సోదరుడు. పూట గడవడం కోసం ఈమె కూడా తల్లిదండ్రులకు సహాయం చేసేది. అటు బడికి వెళుతూనే ఇటు పొలంలో పనిచేసేది.
ఆ సమయంలోనే అథ్లెటిక్స్ మీద మేరీ ఇష్టం పెంచుకుంది. జావెలిన్, 400 మీటర్ల రన్నింగ్‌పై ఎక్కువ దృష్టిసారించేది. అప్పుడే డింగ్కో సింగ్ అనే బాక్సర్.. 1998 ఆసియాన్ గేమ్స్‌లో గోల్డ్ సాధించి సొంత రాష్ట్రం మణిపుర్‌కు వెళ్లాడు. అప్పట్లో ఆ బాక్సర్ పేరు రాష్ట్రమంతా మార్మోగిపోయింది. అలా మేరీ కోమ్కు బాక్సింగ్ పరిచయమైంది. 2000లో బాక్సింగ్ శిక్షణ మొదలుపెట్టింది. 15వ ఏట ఇంటిని వదిలి ఇంపాల్లోని స్పోర్ట్స్ అకాడమీలో చేరింది. అక్కడ ఆమెకు బాక్సింగ్‌లో పునాది పడింది. అక్కడి నుంచి ఒక్కో దశలో ఒక్కో కోచ్.. మేరీ కోమ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ బాక్సర్‌గా నిలిపేందుకు తమ వంతు కృషి చేశారు.
ఇదీ చూడండి:- Mary kom: అతడిని చూసేందుకు క్యూలో నిలబడేదాన్ని
తండ్రి దగ్గర ఆ విషయాన్ని దాచి..
బాక్సింగ్‌పై ఇష్టం పెరిగిన తొలినాళ్లల్లో ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పలేదు మేరీకోమ్. బాక్సింగ్‌తో కూతురి ముఖం పాడైపోయి, పెళ్లి జరగదనే భయం ఆయనలో ఉండేది. అందుకే మేరీ కూడా చెప్పలేదు. 2000 రాష్ట్ర బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన మేరీకోమ్ ఫొటో, పేపర్లో పడింది. అది జరిగిన మూడేళ్ల తర్వాత.. మేరీ బాక్సింగ్‌లో ముందుకు వెళ్లేందుకు ఆయన అంగీకరించారు.
తల్లైనా.. తగ్గేదే లేదు..
2000లో పరిచయమైన ఫుట్‌బాలర్ కరుంగ్ ఒన్లెర్ను 2005లో పెళ్లిచేసుకుంది మేరీకోమ్. వీరికి ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. వీరిలో కవలలు కూడా ఉన్నారు. 2018లో మేరీ దంపతులు మెర్లిన్ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.
అయితే.. అమ్మయిన తర్వాత ఛాంపియన్‌గా నిలిచిన వారి జాబితాలో ముందుంటుంది భారత నారి మేరీకోమ్. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టిన మేరీ.. నింగ్బో (చైనా, 2008), బ్రిడ్జిటౌన్ (2010) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు గెలిచింది. అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం(mary kom olympic medals) గెలవడం. 2010, 14 ఆసియా క్రీడల్లోనూ ఆమె పతకాలు సాధించింది. వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను ఆరుసార్లు గెలుపొందిన ఏకైక మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. 8 వరల్డ్ చాంపిషయన్షిప్ పతకాలు సాధించిన ఏకైక మహిళ కూడా ఈమెనే కావడం విశేషం. ఆమె సాధించిన ఘనతల్లో ఇవి కొన్ని మాత్రమే. జాతీయస్థాయిలో ఎన్నో రికార్డులు ఆమె వశమయ్యాయి.
అవార్డులు..
- అర్జున అవార్డు (2003)
- పద్మశ్రీ (2006)
- ఖేల్‌రత్న (2009)
- పద్మ భూషన్(2013)
- పద్మ విభూషణ్(2020)
మేరీ కోమ్ ఇన్ని ఘనతలు(mary kom achievements) సాధించడానికి కారణం ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం అని 15వ ఏట ఆమె వేలు పట్టుకుని బాక్సింగ్‌లో అడుగులు వేయించిన ఇంపాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు అంటున్నారు.
ఒకప్పుడు పొలంలో పనిచేస్తే కానీ పూట గడవని జీవితం మేరీ కోమ్ది. కానీ ఇప్పుడు.. ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఇల్లు ఆమె సొంతం. దీని వెనుక మేరీ కోమ్ కష్టం, కఠోర సాధన దాగి ఉన్నాయి. కష్టాలకు తలొగ్గకుండా.. ఆత్మవిశ్వాసంతో 'పంచ్' విసిరి.. భారత క్రీడా చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న మేరీ కోమ్ జీవితం ఎందరికో ఆదర్శం. అందుకే.. మేరీ.. నీకు సలాం!
ఇవీ చూడండి:-