ఒలింపిక్ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధు 'స్పెయిన్ మాస్టర్స్' ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ సీజన్లో తొలి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో.. రెండో సీడ్ సింధు.. 24-22, 22-20తో యెజియా మిన్ (సింగపూర్)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. తొలి గేమ్‌లో మొదట 15-20తో వెనుకబడింది. ఆ స్థితి నుంచి గొప్పగా పుంజుకున్న సింధు.. 5 వరుస పాయింట్లతో స్కోరు సమం చేసింది. అనంతరం అదే జోరుతో గేమ్ గెలిచింది. రెండో గేమ్‌లో కూడా నువ్వానేనా అన్నట్లు పోరు సాగింది. కానీ ఆరంభంలో 1-6తో వెనుకబడినా.. విరామ సమయానికి సింధు 11-6తో ఆధిక్యంలోకి వచ్చింది. బ్రేక్ తర్వాత మిన్ పుంజుకోవడం వల్ల స్కోర్లు సమమవుతూ వెళ్లాయి. చివరకు 20-20తో ఉన్న దశలో ఒత్తిడిని అధిగమించి వరుసగా రెండు పాయింట్లు దక్కించుకుంది సింధు. ఆ తర్వాత గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అయితే, కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ గెలిచిన తర్వాత.. సింధూకి ఇదే తొలి ఫైనల్ కావడం గామనార్హం.
గాయం కారణంగా సుదీర్ఘ విశ్రాంతి తీసుకుంది సింధు. ఆ తర్వాత మ్యాచ్‌లు ఆడుతూ తిరిగి ఫామ్‌లోకి రావడానికి కష్టపడుతోంది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సింధూకు.. ఈ విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది. 2016 నవంబర్ నుంచి మొదటిసారి టాప్ 10 లిస్టులోంచి సింధు నిష్క్రమించింది. ఇక, మార్చి ఆరంభంలో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ నుంచి మొదటి రౌండ్లోనే బయటకు వచ్చేసింది. ఆ తర్వాత జరిగిన స్విస్ ఓపెన్ సూపర్ 300లో టైటిల్ చేజార్చుకుంది. అంతకుముందు జనవరిలో జరిగిన ఇండియన్ ఓపెన్, మలేసియా ఓపెన్‌లో మొదటి రౌండ్లోనే నిష్క్రమించిది.
కొచ్ వేటలో సింధు..!
ఈ ఏడాది ఫిబ్రవరిలో పీవీ సింధు తన కోచ్ పార్క్ టే సాంగ్‌తో తెగతెంపులు చేసుకుంది. నాలుగేళ్ల పాటు పార్క్ కోచింగ్‌లో శిక్షణ పొందిన సింధూ.. ప్రస్తుతం కొత్త కోచ్ కోసం వెతుకులాటలో పడింది. ఈ విషయాన్ని పార్క్ టే సాంగ్ స్పష్టం చేశాడు. సింధు నిర్ణయాన్ని గౌరవిస్తూ తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు చెప్పాడు. కాగా, 2019 వరల్డ్ ఛాంపియన్షిప్స్ నుంచి పార్క్ టే సాంగ్ - పీవీ సింధు ప్రయాణం మొదలైంది. మొదట్లో అతడిని మెన్స్ సింగిల్స్ కోచ్‌గా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించినా.. తర్వాత సింధు పర్సనల్ కోచ్‌గా అయ్యాడు. పార్క్ కోచింగ్ శిక్షణలో సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.