PV Sindhu BWF Ranking : భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన పీవీ సింధు.. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకుంది. గతవారం బీవెన్ జాంగ్ చేతిలో ఓడిపోయి ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌తోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గతేడాది బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఈ స్టార్.. అప్పటి నుంచి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది.
PV Sindhu Injury : గతేడాది ఆగస్టులో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు గాయం అయింది. దాదాపు ఐదు నెలల పాటు ఇంట్లోనే ఉన్న సింధు.. ఈ ఏడాది జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్‌లో తిరిగి షటిల్ పట్టుకుంది. అయితే, ఈ టోర్నీతో పాటు ఇదే నెలలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లో కూడా ఓటమిపాలైంది. 2023 మార్చి ఆరంభంలో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ నుంచి మొదటి రౌండ్లోనే బయటకు వచ్చేసింది పీవీ సింధు.
PV Sindhu Schedule 2023 : ఏప్రిల్-మేలో జరిగిన మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ (Madrid Spain Masters 2023) టోర్నీలో ఫైనల్లో ఓడి.. టైటిల్ చేజార్చుకుంది పీవీ సింధు. అనంతరం జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్, సింగపూర్ ఓపెన్‌లో మొదటి రౌండ్లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత జరిగిన ఇండోనేసియా ఓపెన్‌లో రెండో రౌండ్లో వెనుదిరిగిన తర్వాత.. తన ప్రదర్శన మెరుగుపరుచుకుని కెనడా ఓపెన్‌లో సెమీ ఫైనల్, యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత జరిగిన కొరియా, జపాన్‌లో ఓపెన్లలో మొదటి రౌండ్లోనే నిష్క్రమించి.. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది. మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ 12 బీవెన్ జాంగ్ ( Beiwen Zhang) చేతిలో ఓడి వెనుదిరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు ఆడిన సింధు.. 19 మ్యాచ్‌ల్లో గెలిచి, 17 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.
Kidambi Srikanth BWF Ranking : మరో స్టార్ షట్లర్ కితాంబి శ్రీకాంత్ 20వ స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్.. వరుసగా ప్రపంచ నంబర్ 9, 11 స్థానాల్లో కొనసాగుతున్నారు. గత వారం సిడ్నీలో జరిగిన సూపర్ 500 టోర్నీలో తొలి సారి సెమీ ఫైనల్‌కు వెళ్లిన రజావత్.. మూడు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్ 7, 6 స్థానాలు మెరుగుపరుచుకుని 43, 49 స్థానాల్లో నిలిచారు. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రపంచ నంబర్ 2లో నిలిచారు. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్‌లు రెండు స్థానాలు కోల్పోయి 19వ స్థానానికి పడిపోయారు.
పీవీ సింధు ఎమోషనల్.. ఆ ఓటమి మానసికంగా ఎంతో ప్రభావాన్ని చూపిందంటూ..
సింధు, సేన్ శుభారంభం.. క్వార్టర్స్‌కు చేరుకున్న భారత ప్లేయర్లు..