Neeraj chopra diamond league 2023 : టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతాక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరోసారి తన సత్తా నిరూపించాడు. లుసానె డైమండ్ లీగ్ పోటీల్లో తన సూపర్ ఫామ్‌ను కొనసాగించి అగ్రస్థానంలో నిలిచాడు. గాయం నుంచి కోలుకుని ఈ టోర్నీలో పునరాగమనం చేసిన అతడు.. జావెలిన్‌ను 87.66 మీటర్లు విసిరి విజేతగా అవతరించాడు. హేమాహేమీలు బరిలో నిలిచిన ఈ పోటీల్లో నీరజ్.. తన తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలో 83.52 మీటర్లు, మూడో ప్రయత్నంలో 85.04 మీటర్లు బల్లెంను విసిరాడు.
అయితే నాలుగో ప్రయత్నంలో మళ్లీ నీరజ్ విఫలమయ్యాడు. ఐదో ప్రయత్నంలో మాత్రం బల్లెంను 87.66 మీటర్లు విసిరి ఒక్కసారిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక రెండో స్థానంలో నిలిచిన జర్మని అథ్లెంట్ జులియన్ వెబర్ 87.03 మీటర్లు బల్లెంను విసరగా, మూడో స్థానానికి పరిమితమైన జాకబ్ వాద్లిచ్ (చెక్ రిపబ్లిక్) 86.13 మీటర్ల దూరాన్ని విసిరాడు. ఈ ఏడాది ఖతార్‌లో జరిగిన దోహా డైమండ్ లీగ్ టోర్నీలోనూ అగ్రస్థానాన్ని దక్కించుకున్నా నీరజ్. అయితే ఆ తర్వాత కండర గాయం అవ్వడం వల్ల ఎఫ్‌బీకే క్రీడలు, పావో నూర్మి ఈవెంట్‌లో పాల్గొనలేకపోయాడు. ఆ టోర్నీలన్నింటికీ దూరమయ్యాడు.
doha diamond league 2023 : ఈ ఏడాది మేలో జరిగిన దోహా డైమండ్ లీగ్ తొలి అంచె టోర్నీలోనూ నీరజ్ విజేతగా నిలిచాడు. ఈటెను అత్యుత్తమంగా 88.67 మీటర్ల దూరం విసిరి స్వర్ణాన్ని అందుకున్నాడు. తొలి త్రోలోనే 88.67 మీటర్ల దూరాన్ని అందుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ఆ సీజన్లో ఉత్తమ త్రో వేసిన ఆటగాడిగానూ నిలిచాడు. ఆ తర్వాత 2, 3 త్రోలలో 86.04 మీ, 85.47 మీటర్లు ఈటెను విసిరాడు. నాలుగో ప్రయత్నంలో ఫౌల్ అయిన అతడు.. 5, 6 ప్రయత్నాల్లో 84.37 మీటర్లు, 86.52 మీటర్లు విసిరి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. అయితే టైటిల్ అందుకున్నప్పటికీ నీరజ్ తను అనుకున్న 90 మీటర్ల లక్ష్యాన్ని మాత్రం అప్పుడు కూడా సాధించలేకపోయాడు. ఇప్పుడు కూడా సాధించలేకపోయాడు.
ఇకపోతే తాజాగా లుసానె ఈవెంట్‌లో బరిలోకి దిగిన భారత స్టార్ లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ నిరుత్సాహపరిచాడు. ఈ ఈవెంట్‌లో అతడు ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. కామన్‌వెల్త్ గేమ్స్ విజేత లాకార్న్ నైన్ మొదటి స్థానంలో నిలవగా, ఒలింపిక్స్ ఛాంపియన్ మిల్టియాడిస్ టెంటోగ్లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇదీ చూడండి :
Neeraj Chopra World Ranking : జావెలిన్‌లో నీరజ్ నం.1.. ఆ స్టార్ అథ్లెట్‌ను వెనక్కి నెట్టి!
Neeraj chopra gold medal : నీరజ్ గోల్డెన్ త్రో.. మళ్లీ విసిరాడు