ఇండోనేసియాలో జరుగుతోన్న 23వ ప్రెసిడెంట్ కప్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ సత్తాచాటింది. 51 కేజీల విభాగంలో చెమట చిందించకుండానే పసిడిని కైవసం చేసుకుంది. తుదిపోరులో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఏప్రిల్ ఫ్రాంక్స్‌పై (ఆస్ట్రేలియా) 5-0 తేడాతో విజయం సాధించింది.
రెండు నెలల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ద్వారా రింగులోకి అడుగుపెట్టిన మేరీ బంగారు పతకంతో ఆకట్టుకుంది. బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల ముందు ఈ విజయం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.
మేలో జరిగిన ఇండియా ఓపెన్‌లో మేరీ స్వర్ణాన్ని గెలిచింది. అనంతరం థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియన్ ఛాంపియన్షిప్స్కు దూరంగా ఉంది. టోక్యో ఒలింపిక్స్ అర్హతపై దృష్టి పెట్టిన కారణంగా ఈ పోటీల్లో పాల్గొనలేదు.
రష్యా వేదికగా సెప్టెంబరు 7 నుంచి జరగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తాచాటి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోందీ మణిపూర్ మణిపూస.
ఇది చదవండి: కపిల్ బృందంపై ఫిర్యాదు- కోచ్ ఎంపిక ఎలా?