మిల్కాసింగ్(Milkha Singh).. స్వతంత్ర భారతానికి అఖండ భారతం అందించిన ఆణిముత్యం. ప్రాణ భయంతో పరుగులు పెట్టిన చోటే ఫ్లైయింగ్ సిక్‌గా మన్ననలు పొందిన గొప్ప అథ్లెట్. దేశ విభజన గాయాలు గుండెను తొలిచేస్తున్నా పరుగు ఆపని వీరుడు. దారిద్య్రాన్ని ధిక్కరించి ప్రారంభించిన పరుగును ఒలింపిక్స్ వరకూ తీసుకెళ్లిన భారతీయుడు. దోపిడీ దొంగగా మారుదామనుకునే స్థాయి నుంచి దేశ అత్యున్నత పురస్కారాలు వరించే వరకూ మిల్కాసింగ్ సాగించిన పరుగు పయనం ఆదర్శనీయం, యువతరానికి ఓ స్ఫూర్తి పాఠం. ఈ ఆధునిక శిక్షణా వసతులు ఉన్న కాలంలో నేను పుట్టి ఉంటే వందేళ్ల పాటు నిలిచి ఉండే రికార్డులను నెలకొల్పే వాడినన్న మిల్కా ప్రకటన ఆయన చేసిన కఠోన శ్రమకు ఓ నిదర్శనం.
ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగు
శత్రు దేశం పాకిస్థాన్ ప్రధాని నుంచే ఫ్లైయింగ్ సిక్‌గా బిరుదు పొందిన మిల్కాసింగ్..1929 నవంబర్ 20న పాక్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న గోవిందపురలో జన్మించారు. సిక్ రాఠోడ్ రాజపుత్రుల కుటుంబంలో 15 మంది సంతానంలో ఒకరుగా మిల్కా జన్మించగా.. అందులో 8 మంది దేశ విభజనకు ముందే మరణించారు. విభజన సమయంలో జరిగిన హింసాకాండలో తన తల్లిదండ్రులతో పాటు.. ఒక సోదరుడ్ని, ఇద్దరు సోదరీమణులను ఈయన కోల్పోయారు. దేశ విభజన సమయంలో తన కుటుంబ సభ్యుల ఊచకోతను ప్రత్యక్షంగా చూసిన మిల్కా.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగు తీశారు. పాక్ నుంచి శరణార్ధులు, శవాలను తీసుకొచ్చే ఓ రైల్లో భారత్ చేరుకున్నారు. వెంటాడే ఆకలి.. దారిద్ర్యం.. బెంగ, భయం ఇలాంటి వాటన్నింటి నుంచి తప్పించేకునేందుకు పరుగు తీశారు. ఆ పరుగే మిల్కాకు తెగింపును ఇచ్చింది. ఆ కాళ్లకు బలాన్నిచ్చింది. ఆ బలమే మిల్కాను ఒలింపిక్స్ వరకూ పరిగెత్తించింది. దేశ విభజన సమయంలో అనాథగా మారిన మిల్కాసింగ్.. ఆ తర్వాత భారత దేశ క్రీడా ఆణిముత్యంగా మారారు.
తిహార్ జైల్లో..
1947లో పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో హిందువులు, సిక్కుల ఊచకోత తీవ్రంగా ఉన్నప్పుడు మిల్కా దిల్లీకి వలస వెళ్లారు. ఓ సందర్భంలో మిల్కాసింగ్ టికెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేసినందుకు పోలీసులు ఆయన్ను తిహార్ జైల్లో బంధించారు. అప్పుడు తన సోదరి మిల్కాను విడిపించుకునేందుకు నగలు అమ్మాల్సి వచ్చింది. ఇలాంటి ఎన్నో దుర్భర పరిస్థితులను ఎదుర్కొని అలసిపోయిన మిల్కాసింగ్.. దోపిడీ దొంగగా మారాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన సోదరడు మల్కన్ సాయంతో ఆర్మీలో చేరేందుకు ప్రయత్నించి 3 సార్లు విఫలమై, నాలుగోసారి సఫలీకృతుడయ్యారు. 1951లో సికింద్రాబాద్‌లోని ఎలక్ర్టికల్ మెకానికల్ ఇంజనీరింగ్ కేంద్రంలో మిల్కాకు ప్రవేశం లభించింది. కొత్తగా నియమితులైన అందరికీ.. భారత సైన్యం ఓ జాతీయస్థాయి పరుగుల పోటీ నిర్వహించగా.. మిల్కా ఆ పోటీలో ఆరో స్థానంలో నిలిచారు. ఈ పరుగే మిల్కాను ఉన్నతాధికారుల దృష్టిలో పడేలా చేసింది. దాంతో భారత సైన్యం మిల్కాకు వ్యాయామ క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించింది.
సికింద్రాబాద్‌లో శిక్షణ
తాను ఈ ఆధునిక శిక్షణా కాలంలో పుట్టి ఉంటే.. తన శ్రమతో మరో వందేళ్లు చెక్కు చెదరని రికార్డులను నెలకొల్పే వాడినని మిల్కా చేసిన ప్రకటన ఆయన శిక్షణ ఎంత కష్టంగా నడిచిందో చెబుతుంది. సికింద్రాబాద్‌లో 9 ఏళ్లు శిక్షణ పొందిన కాలంలో.. మిల్కా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నారు. ఆర్మీలో చేరిన తర్వాత మూడేళ్లపాటు కాళ్లకు బూట్లు లేకుండానే పరిగెత్తారు. సికింద్రాబాద్- బొల్లారం మధ్య నడిచే రైలుతో సమానంగా దూసుకెళ్తూ తన పరుగుకు పదును పెట్టుకునేవారు.
రికార్డుల పరుగు
అనంతరం పరుగు పోటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన మిల్కాసింగ్.. 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో 200, 400 మీటర్ల పోటీల్లో మనదేశానికి ప్రాతినిథ్యం వహించారు. కానీ ప్రధాన పోటీకి అర్హత సాధించలేకపోయారు. తర్వాత 1958 కటక్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో మిల్కాసింగ్ 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకాలు చేజిక్కించుకుని.. చరిత్ర సృష్టించారు. 1958వ సంవత్సరం మిల్కా జీవితంలోనేగాక భారత క్రీడా చరిత్రలోనూ ఓ నూతన అధ్యాయం. ఆ ఏడాది బ్రిటీష్ ప్రభుత్వం, కామన్‌వెల్త్ సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ క్రీడల్లో 46.6 సెకన్ల సమయంలో 440 యార్డ్స్ పరుగును పూర్తి చేసిన మిల్కాసింగ్ స్వర్ణ పతకాన్ని ఒడిసిపట్టాడు. ఈ ఘనతతో స్వతంత్ర భారతదేశం తరపున బంగారు పతకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడిగా ఘనత వహించారు. ఈ పోటీలో మిల్కా నెలకొల్పిన రికార్డు నాలుగు దశాబ్దాల పాటు చెక్కు చెదరలేదు.
పాక్ ప్రధాని బిరుదు
1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్ వైఫల్యం మిల్కాసింగ్‌ను సందిగ్దంలోకి నెట్టేసింది. ఆ ఒలింపిక్స్‌లో తన టెక్నిక్‌లో లోపాలను గుర్తించిన మిల్కా.. మెల్‌బోర్న్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అమెరికా రన్నర్ చార్లెస్ జెన్‌కిన్స్‌ను కలిసి తనకు శిక్షాణా పద్దతుల్లో సలహాలు ఇవ్వమని కోరారు. ఈ శిక్షణలో మిల్కా మరింత రాటుదేలారు. 1958, 1962 ఏడాదుల్లో నిర్వహించిన ఏషియన్స్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. దేశ విభజన గాయాలను మనసులో మోస్తున్న మిల్కాసింగ్ 1960లో పాకిస్థాన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొనేందుకు నిరాకరించారు. కానీ అప్పటి ప్రధాని నెహ్రూ జోక్యంతో పాక్‌కు వెళ్లిన మిల్కా.. 60 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో పాక్ ప్రఖ్యాత రన్నర్ అబ్దుల్ ఖాలిక్‌ను వెనక్కి నెట్టి.. స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. స్వర్ణ పతక బహూకరణ సభలో నాటి పాక్ ప్రధాని జనరల్ అయూబ్ ఖాన్.. మిల్కాసింగ్‌ను ఫ్లైయింగ్ సిక్ అని ప్రేమతో సంభోదించారు. మిల్కా వేగంగా పరిగెత్తుతుంటే ఎగురుతున్నట్లు ఉందని ఆయూబ్ ఖాన్ అలా పిలిచారు. అనాటి నుంచి మిల్కాకు ఫ్లైయింగ్ సిక్ పేరు బిరుదుగా స్థిరపడిపోయింది.
చిన్న తప్పుతో చేజారిన ఒలింపిక్ పతకం
1960లో రోమ్ నగరంలో జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పోటీలో మిల్కాసింగ్ ఫేవరేట్లలో ఒకడిగా బరిలోకి దిగారు. పరుగు మొదలుకాగనే మిల్కాసింగ్ చిరుతులా దూసుకుపోయారు. దాదాపు 250 మీటర్ల దాకా ముందంజలో ఉన్నా మిల్కా.. ఎందుకో ఓ సారి వెనక్కి తిరిగిచూశారు. ఆ చిన్నతప్పుతో ప్రత్యర్థులు ముందుకు దూసుకెళ్లారు. ఆ పరుగు పందెంలో మిల్కా నాలుగో స్థానంలో నిలిచి రెప్పపాటులో పతకాన్ని కోల్పోయారు. ఆ నాలుగో స్థానం సమయం అప్పటికీ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు. ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయినా మిల్కా మాత్రం భారతీయుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
అర్జున అవార్డు తిరస్కరణ
తన జీవితకాలంలో మిల్కాసింగ్ మొత్తం 80 రేసుల్లో పాల్గొంటే అందులో 77 రేసుల్లో విజయం సాధించారు. మిల్కాసింగ్ సాధించిన ఘనతలను గుర్తించిన కేంద్రం.. 1959లో పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. 40 ఏళ్ల తర్వాత 2001వ ఏడాదిలో అర్జున పురస్కారాన్ని ప్రకటించడం వల్ల నొచ్చుకున్న మిల్కాసింగ్.. దాన్ని తిరస్కరించారు. పంజాబ్ ప్రభుత్వ క్రీడల విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గానూ ఆయన విధులు నిర్వహించారు. రిటైరైన క్రీడాకారుల వైద్య ఖర్చులను భరించేందుకు మిల్కాసింగ్ ఓ ట్రస్ట్‌ను నెలకొల్పి సేవ చేశారు.
కుటుంబంలో రెండు పద్మశ్రీ అవార్డులు
మిల్కాసింగ్ సతీమణి పేరు నిర్మల్ కౌర్. ఆమె జాతీయ వాలీబాల్ టీమ్ మాజీ కెప్టెన్. ఆమె 2021 జూన్ 13న కన్నుమూశారు. మిల్కా-నిర్మల్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఒక కుమారుడు ఉన్నారు. మిల్కా కుమారుడు జీవ్ మిల్కాసింగ్.. గోల్ఫ్ ఛాంపియన్. జీవ్ మిల్కాసింగ్‌కు కూడా పద్మశ్రీ పురస్కారం దక్కింది. దేశంలో రెండు పద్మశ్రీలు సాధించిన కుటుంబం తనదేనని మిల్కా గర్వంగా చెబుతుండేవారు. మిల్కా జీవితం ఆధారంగా తెరకెక్కిన 'భాగ్ మిల్కా భాగ్' చిత్రం ఆయనను చాలామందికి చేరువ చేసింది. ఆ చిత్రాన్ని చూసిన అనంతరం.. మిల్కా కన్నీటిపర్యంతమయ్యారు.
ఇవీ చూడండి: Milkha Singh: కళ్ల ముందే ఊచకోత.. కట్టుబట్టలతో భారత్‌కు రాక