కరోనా మహమ్మారి(Covid Pandemic) ముప్పు తొలగని నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)ను క్రీడాభిమానులు కేవలం టీవీల్లోనే చూడాల్సివుంటుందని స్పష్టమవుతోంది. ఒకవేళ ప్రేక్షకులను అనుమతించినా.. అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 68 వేల ప్రేక్షక సామర్థ్యం గల నేషనల్ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేవలం ప్రముఖ అతిథులు మాత్రమే ఉంటారని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఓ జపాన్ పత్రిక పేర్కొంది.
ఈ గురువారం జరిగే సమావేశం అనంతరం టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ(Tokyo Olympics Organizing Committee), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఏసీ) (International Olympic Committee).. ప్రేక్షకులను అనుమతించడంపై నిర్ణయాన్ని ప్రకటిస్తాయని భావిస్తున్నారు. స్టేడియం సామర్థ్యంలో 50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించే అవకాశముందని కొన్ని వారాల కింద ప్రకటించారు. కానీ జపాన్‌లో కొవిడ్ కేసులు పెరుగుతుండడం వల్ల నిర్వాహకులు వెనక్కి తగ్గారు. ఐఓసీ ఆదాయంలో 75 శాతం టీవీ హక్కుల(TV Rights) ద్వారానే వస్తుంది. ప్రేక్షకులను అనుమతించకుండా ఒలింపిక్స్‌ను కేవలం టీవీలకు పరిమితం చేసినా.. ఐఓసీకి 3 నుంచి 4 బిలియన్ డాలర్ల ఆదాయం రానుంది. ఒలింపిక్స్ కోసం జపాన్ రాకుండా విదేశీ అభిమానులను ఇప్పటికే నిషేధించారు. ప్రముఖులు, స్పాన్సర్లను ఒలింపిక్ ఆరంభోత్సవంతో పాటు ఇతర ఈవెంట్లకూ అనుమతిస్తారు. కానీ వాళ్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: Tokyo Olympics: కష్టాలను ఎదురీది.. ఒలింపిక్స్ గమ్యాన్ని చేరి!