దిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. సోమవారం జరిగిన పోటీల్లో తాజాగా మరో 3 స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. దీంతో.. ఈ ఏడాది టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నారు షూటర్లు.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో యువ షూటర్లు సౌరభ్ చౌదరి, మనూ బాకర్ జంట గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఇరాన్ జంట గోల్నౌష్ సెభతోల్లాహి-జావెద్ ఫోరోగిపై భారత్ జోడీ విజయం సాధించింది. తొలుత 0-4తో పోటీలో వెనుకబడిన ఇండియా జోడీ.. గొప్పగా పుంజుకుంది. చివరికి 16-12తో ఇరాన్ జోడీని చిత్తు చేసి విజయాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచకప్ మిక్స్డ్ విభాగంలో స్వర్ణం సాధించిన ఐదొవ జంట ఇది.
ఇదీ చదవండి: షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో స్వర్ణం
ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో ఎలావెనిల్-దివ్యాన్ష్ జోడీ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఎలావెనిల్‌కు ఇదే తొలి సీనియర్ ప్రపంచకప్ మెడల్ కాగా, దివ్యాన్ష్‌కు నాలుగో పతకం. హంగేరియాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ జంట ఇస్తావాన్ పెని-ఎస్జ్టర్ డెనెస్ జంటను 16-10 తేడాతో ఓడించింది భారత జోడీ. కరోనా అనంతరం ఆడుతున్న తొలి టోర్నమెంట్ అయినప్పటికీ.. వీరిద్దరూ ఎక్కడా తడబాటుకు గురికాలేదు.
పురుషుల స్కీట్ విభాగంలో భారత బృందం స్వర్ణం గెలుపొందింది. ఖతార్‌కు చెందిన నాసర్ అల్ అట్టియా, అలీ అహ్మద్, రషీద్ హమద్ బృందంపై ఇండియా టీమ్ విజయం సాధించింది. గోల్డ్ మెడల్ సాధించిన వారిలో గుర్జోట్ ఖన్గురా, మైరాజ్ అహ్మద్ ఖాన్, అన్గద్ వీర్ సింగ్ బజ్వా ఉన్నారు.
ఇప్పటివరకు ఈ వరల్డ్‌కప్‌లో 6 బంగారు, 4 రజతాలతో పాటు 4 కాంస్య పతకాలు సాధించిన ఇండియా.. మొత్తం 14 పతకాలతో లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 3 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్, ఒక కాంస్య పతకంతో అమెరికా తర్వాతి స్థానంలో ఉంది.
ఇదీ చదవండి: ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం