ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వేల మంది చిన్నారులు, విద్యార్థులు, క్రీడాకారుల భాగస్వామ్యంతో అన్ని దేశాల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. ఈరోజున ఆటల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ఇలా మొదలైంది..
1948లో తొలిసారి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇది 1894, జూన్ 23న పారిస్‌లోని సోర్బొన్నే వేదికగా జరిగిన మోడ్రన్ ఒలింపిక్స్‌కు గుర్తుగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వయసు, లింగ భేదం లేకుండా అందరూ ఆటల్లో పాల్గొనాలనేదే ఈరోజు ఉద్దేశం. ప్రతి దేశంలోని ఒలింపిక్ కమిటీలు(ఎన్ఓసీ) ఇందులో భాగస్వామ్యం అవుతాయి. 1987లో 45 దేశాలు మాత్రమే ఈ వేడుకలో పాలుపంచుకోగా.. ప్రస్తుతం 205 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఆ చిహ్నాలు ఎందుకంటే...
ఒలింపిక్ రింగ్‌లతో కూడిన జెండాను తొలిసారి 1913లో రూపొందించారు. ఆధునిక ఒలింపిక్ గేమ్స్ పితామహుడైన పియర్ డీ కెబర్టిన్ దాన్ని ప్రవేశపెట్టారు. ఒలింపిక్ ప్రతిజ్ఞ సహా నినాదం 'ఒలింపిక్స్‌లో గెలవడం కాదు ముఖ్యం, అందులో పాల్గొనడం' కూడా ఆయనే రాశారు. ఒలింపిక్ చిహ్నంలో ఐదు రింగులు ఉంటాయి. నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉంటూ.. వాటికి వెనుక వైపున తెల్లని రంగు బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. 1914లో ప్రపంచ దేశాలను కలపాలనే ఉద్దేశంతో ఒలింపిక్ గేమ్స్‌ని తొలిసారిగా ప్రపంచవ్యాప్తం చేశారు. అలా ఐదు ఖండాలకు గుర్తుగా ఐదు రింగులను రూపొందించారు. వాటి రంగుల్లో ఏదో ఒక కలర్.. ప్రతి దేశం జెండాలోనూ ఉంటుందని కెబర్టిన్ చెప్పారు.
ఈ ఏడాది నిరాశ...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదాపడ్డాయి. షెడ్యూల్ ప్రకారం.. జులై 24న ప్రారంభమై 16 రోజులపాటు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. కానీ మహమ్మారి కారణంగా విశ్వక్రీడలను వచ్చే సంవత్సరం జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహించనున్నారు.