భారత హాకీపై కరోనా ప్రభావం పడింది. ఈ వైరస్ కారణంగా వచ్చే నెల 10 నుంచి మొదలు కావాల్సిన జూనియర్, సబ్ జూనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్స్‌ను వాయిదా వేస్తున్నట్లు భారత హాకీ సమాఖ్య సోమవారం ప్రకటించింది. పరిస్థితులన్నీ చక్కబడితే వచ్చే నెల చివరి నుంచి పోటీల్ని నిర్వహించే వీలుంది.
"ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని సబ్ జూనియర్, జూనియర్ మహిళల, పురుషుల వార్షిక ఛాంపియన్‌షిప్స్‌ను వాయిదా వేయాలని భారత హాకీ సమాఖ్య నిర్ణయించింది. ఈ ఛాంపియన్‌షిప్స్ జరిగే కొత్త తేదీలను ప్రకటించినప్పటికీ ఈ వైరస్ ప్రభావంపై పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంటుంది" అని భారత హాకీ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ చెప్పారు.
భయం ఉన్నా..: కరోనా భయం ఉన్నప్పటికీ ఒలింపిక్స్ బాక్సింగ్ యూరప్ క్వాలిఫయర్ టోర్నీని లండన్‌లో కొనసాగిస్తున్నారు. గత శనివారమే ఈ టోర్నీ ఆరంభమవగా, సోమవారం నుంచి తలుపులు మూసేసి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో దాదాపు పన్నెండు దేశాల నుంచి సుమారు 350 మంది పురుష, మహిళా బాక్సర్లు పాల్గొంటున్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఐరోపా బాక్సర్లకు ఇది తొలి అవకాశం. అయితే ఓ వైపు వైరస్ విజృంభిస్తున్నప్పటికీ ఈ టోర్నీ నిర్వహిస్తుండడం వల్ల బాక్సర్ల ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని యురోపియన్ బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఫ్రాంకో ఆందోళన వ్యక్తం చేశాడు.
జాగ్రత్త పడాల్సింది
కరోనా వైరస్ సోకిన తొలి ఎన్‌బీఏ ఆటగాడు రుడీ గోబర్ట్ దాన్ని నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు. అయితే వైరస్ సోకేముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందని అతను అంటున్నాడు. "నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్నవాళ్లను రక్షించుకోవాల్సిన అవసరముంది. నేను ముందుగానే జాగ్రత్త పడాల్సింది. ఈ వైరస్ పట్ల కొంచెం అవగాహన కలిగి ఉంటే సరిపోయేది. దీన్ని తీవ్రంగా పట్టించుకోవాల్సింది. మిగతావాళ్లు నాలా కాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారనే నమ్మకం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండండి. రోజురోజుకూ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు అనిపిస్తోంది. నన్ను పర్యవేక్షిస్తున్న వైద్యబృందానికి కృతజ్ఞతలు" అని సామాజిక మాధ్యమాల్లో ఎన్‌బీఏ పోస్టు చేసిన వీడియోలో అతను పేర్కొన్నాడు. అతని సహచర ఆటగాడు మిచెల్‌కూ ఈ వైరస్ సోకింది.
- సోమవారం జరిగిన ఐపీఎల్ ఎనిమిది ఫ్రాంఛైజీల యజమానుల టెలి కాన్ఫరెన్స్‌లో పదమూడో సీజన్ నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
"ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 48 గంటల్లో పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు. కాబట్టి ఐపీఎల్ 2020 నిర్వహణ గురించి ఇప్పుడే మాట్లాడడం తెలివైన విషయం అనిపించుకోదు" అని ఓ ఫ్రాంఛైజీ యజమాని పేర్కొన్నాడు. వచ్చే నెల 15 వరకూ ఐపీఎల్ పదమూడో సీజన్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
శిక్షణపై దృష్టి పెట్టండి
కరోనా కారణంగా దేశంలో అన్ని క్రీడా టోర్నీలు ఆగిపోయాయి. అయితే అథ్లెట్లు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా శిక్షణపై దృష్టి పెట్టి రాబోయే పోటీల కోసం సిద్ధంగా ఉండాలని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు సూచించారు.
"వైరస్ కారణంగా క్రీడా కార్యక్రమాలు, టోర్నీలను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా శిక్షణపై పూర్తి దృష్టి పెట్టాలని అథ్లెట్లను కోరుతున్నా" అని మంత్రి ట్వీట్ చేశారు.
ఒలింపిక్స్ నిర్వహణపై గడువు లేదు
టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి తుది గడువు లేదని ఆ క్రీడల కోసం నియమించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమన్వయ కమిటీ అధ్యక్షుడు జాన్ కోట్స్ చెప్పారు. మే లోపే నిర్ణయం తీసుకోవాలంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. కరోనా భయం ఉన్నప్పటికీ ఒలింపిక్స్‌ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
"జులై 24న ఒలింపిక్స్‌ను ఆరంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రీడల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి గడువు లేదు. అంతర్జాతీయ టోర్నీలు జరిగే అవకాశం లేదు కాబట్టి ఒలింపిక్స్‌కు అర్హత సాధించని ఆటగాళ్లకు ఇబ్బంది తప్పదు" అని కోట్స్ చెప్పారు.
మరోవైపు టోక్యో క్రీడల కోసం ఒలింపిక్స్ జ్యోతిని అప్పగించే కార్యక్రమానికి ప్రేక్షకులను అనుమతించకూడదని గ్రీక్ ఒలింపిక్ కమిటీ సోమవారం నిర్ణయించింది. ఏథెన్స్‌లో గురువారం జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలను అనుమతిస్తూ వాళ్ల కోసం ముందుగా జారీ చేసిన కార్డులు చెల్లవని కమిటీ పేర్కొంది.
ఐపీఎల్ ఆటగాళ్ల ఇంటిముఖం
కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు శిక్షణ శిబిరాలను రద్దు చేయడంలో ఆటగాళ్లందరూ ఇంటిముఖం పట్టారు. ఈ మహమ్మారి కారణంగా ఈనెల 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. వచ్చే నెల 15కు వాయిదా పడడం వల్ల శిక్షణ శిబిరాలన్నిటిని తిరిగి సమాచారం ఇచ్చే వరకు ముసివేస్తున్నట్లు ఫ్రాంచైజీలు ప్రకటించాయి. మూడుసార్లు ఛాంపియన్లు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌తో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికే శిబిరాలను ఆపేశాయి.
"ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి 21న ఆరంభం కావాల్సి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శిబిరాన్ని రద్దు చేశాం. క్రికెటర్లంతా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించి సురక్షితంగా ఉండాలి" అని ఆర్‌సీబీ ట్వీట్ చేసింది.
బీసీసీఐ కార్యాలయం మూసివేత
కరోనా మహమ్మారి కారణంగా ముంబయిలోని తన ప్రధాన కార్యాలయాన్ని బీసీసీఐ మూసివేసింది. మంగళవారం నుంచి ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగులను బోర్డు ఆదేశించింది.
"కరోనా వైరస్ కారణంగా వాంఖడే స్టేడియంలోని ప్రధాన కార్యాలయాన్ని మూసి వేస్తున్నామని ఉద్యోగులకు తెలిపాం. అందరూ ఇంటి వద్ద నుంచి పని చేయాలని చెప్పాం" అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.
బీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్-13ను ఏప్రిల్ 15కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇరానీ ట్రోఫీ సహా అన్ని దేశవాళీ టోర్నీలు వాయిదా పడ్డాయి.
వ్యాఖ్యాతగా ఆనంద్
భారత దిగ్గజ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ జర్మనీలో చిక్కుకుపోయాడు. ఒండస్‌లీగా చెస్ లీగ్ కోసం అక్కడికి వెళ్లిన అతడు, సోమవారం తిరిగి భారత్‌కు రావాల్సింది. అయితే వైరస్ కారణంగా ఆ దేశం విధించిన ప్రయాణ ఆంక్షల కారణంగా విశ్వనాథ్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ స్వీయ దిగ్బంధంలో ఉన్న అతను తొలిసారిగా వ్యాఖ్యాతగా మారనున్నాడు. రష్యాలోని ఎక్తరిన్‌బర్గ్‌లో మంగళవారం ఆరంభమయ్యే ఫిడే క్యాండిడేట్స్ టోర్నీ కోసం ఓ వెబ్‌సైట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.
"ఆనంద్ ప్రస్తుతం ఫ్రాంక్‌ఫర్ట్ ప్రాంతానికి సమీపంలో ఉన్నాడు. అక్కడి ప్రయాణ ఆంక్షలు, ఆరోగ్య సూచనల ప్రకారం అక్కడే ఆగిపోయాడు. అతను తిరిగి భారత్‌కు ఎప్పుడు వచ్చేది త్వరలో తెలుస్తుంది" అని ఆనంద్ భార్య అరుణ తెలిపింది.
సిరీస్ వాయిదా
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వన్డే, టెస్టులను వాయిదా వేస్తున్నట్లు రెండు దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. బంగ్లాదేశ్ ఈ నెల 29న పాక్‌కు రావాల్సింది. కరాచీలో ఏప్రిల్ 1న వన్డే, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 9 నుంచి మ్యాచ్‌లు ఆడాల్సింది. రావల్పిండిలో ఫిబ్రవరిలో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 44 పరుగుల తేడాతో గెలిచింది. ఈ నెల 24న ఆరంభం కావాల్సిన పాకిస్థాన్ కప్ వన్డే టోర్నీని, ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) వాయిదా వేసింది.
మరోవైపు వచ్చే నెలలో ఐర్లాండ్‌లో జింబాబ్వే పర్యటన సైతం వాయిదా పడింది. ఈ రెండు జట్లు మూడేసి టీ20లు, వన్డేలు ఆడాల్సింది. దక్షిణాఫ్రికాలో అన్ని రకాల క్రికెట్ (ఫస్ట్‌క్లాస్, లిస్ట్- ఎ, జూనియర్ తదితర)పై వచ్చే రెండు నెలల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ సంఘం ప్రకటించింది. ఈ నిషేధం కారణంగా ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వన్డే కప్ సెమీస్, ఫైనల్స్ మ్యాచ్‌లూ రద్దయినట్లే.
ఇదీ చూడండి.. కరోనా వల్ల స్వీయ నిర్బంధంలో ఉన్నా: పుల్లెల గోపీచంద్