దిల్లీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లోని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం దక్కింది. ఈ విభాగంలో మిగతా బృందాలను ఓడించి ఎలవెనిల్ వలరివన్, దివ్యాంశ్ పన్వార్ విజేతగా నిలిచారు.
ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో మను బాకర్, యశస్విని దీస్వాల్, శ్రీ నివేదాలతో కూడిన మహిళల బృందం స్వర్ణం నెగ్గింది. అలాగే పురుషుల విభాగంలో సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ, షాజార్లతో కూడిన బృందం బంగారు పతకం సాధించింది.
అలాగే మహిళల స్కీట్‌లో భారత యువ షూటర్ గనీమత్ సెకో కాంస్యం గెలుచుకుంది. ప్రపంచకప్ షూటింగ్ మహిళల స్కీట్‌లో ఈ ఘనత సాధించిన భారత తొలి షూటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్ జూనియర్ విభాగం (2018)లో పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్ కూడా ఆమెనే. స్కీట్ ఫైనల్లో గనీమత్ 40 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. కార్తీకీసింగ్ (32) నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల స్కీట్‌లో గుర్‌జ్యోత్ (17 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచాడు