లాక్‌డౌన్‌లో స్టేడియాలు మూసేయడం వల్ల క్రీడాకారులు సుదీర్ఘ కాలంగా ఆటకు దూరంగా ఉంటున్నారు. ఇల్లు, వరండా, అపార్ట్‌మెంట్ కింద సొంతంగా ఫిట్‌నెస్ కసరత్తులు చేస్తున్నా ఫలితం అంతంతమాత్రమే. దీంతో క్రీడాకారులు, కోచ్‌లు కొత్త తరహా పద్ధతుల్లో శిక్షణకు శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు అనుసరిస్తున్న 'ట్రెయినింగ్ వయా టెక్నాలజీ' పద్ధతి ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ క్రీడాకారులు అనుసరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్, జూమ్‌ల ద్వారా కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ కొనసాగుతోంది. ఈ విషయంలో మిగతా క్రీడలతో పోలిస్తే అథ్లెటిక్స్ ముందు వరుసలో ఉంది.
నాగపురి రమేశ్ ఆధ్వర్యంలో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ నెల రోజులుగా శిక్షణలో నిమగ్నమైంది. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా హైదరాబాద్ నుంచి రమేశ్ ఇచ్చే సూచనలు, సలహాల్ని పాటిస్తూ భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ద్యుతి సాధన చేస్తోంది. "ట్రైనింగ్ సెషన్ పూర్వయ్యే వరకు రమేశ్ సర్ వీడియో కాల్‌లో ఉంటారు. ఏం చేయాలో.. ఏం పాటించాలో అన్నీ చెప్తారు. పరుగు టైమింగ్ నమోదు చేస్తారు. కసరత్తులు వీడియోలో చేసి చూపిస్తారు. తప్పులు దొర్లితే సరిచేస్తారు" అని ద్యుతి తెలిపింది.
ఒకరితో మరొకరు తాకే అవసరం లేని క్రీడల్లో టెక్నాలజీ శిక్షణ జోరుగా సాగుతోంది. అథ్లెట్లతో పాటు షూటర్లు ఆన్‌లైన్‌లో కోచ్‌ల సూచనల మేరకు సాధన చేస్తున్నారు. రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లోనూ ఈ ధోరణి కొనసాగుతోంది. ఇతర దేశాల్లో ఉండే విదేశీ కోచ్‌ల పర్యవేక్షణలో షూటర్లు, రెజ్లర్లు, బాక్సర్లు, లిఫ్టర్లు తర్ఫీదు పొందుతున్నారు. "లాక్‌డౌన్‌లో మరోమార్గం లేకపోవడం వల్ల సాంకేతికతపై ఆధారపడుతున్నాం. కష్టంగానే ఉన్నా అలవాటు పడుతున్నాం. నేరుగా శిక్షణకు ఇది ప్రత్యామ్నాయం కాకపోయినా ఎంతోకొంత లోటు భర్తీ అవుతుందని భావిస్తున్నాం. అథ్లెట్లు సరైన వసతులు లేకపోయినా ఉన్నవాటితోనే సర్దుకుపోతున్నారు. డంబుల్స్ బదులు నీళ్ల సీసాలు.. బావుల్లో స్విమ్మింగ్.. ఇసుక వాగుల్లో లాంగ్‌జంప్.. మొద్దుల్ని తాడుతో కట్టుకుని సామర్థ్యం పెంచుకునేలా పరుగు తీస్తున్నారు. గ్రామాల్లో లభించే నిమ్మకాయలు, బెల్లం, పల్లీలు, పెసర్లు, పసుపు కలిపిన పాలు తాగుతూ డైట్ అనుసరిస్తున్నారు" అని అథ్లెటిక్స్ కోచ్ రమేశ్ వివరించాడు.
అయితే ఆన్‌లైన్ తరగతులు శిక్షణకు ప్రత్యామ్నాయం కాదని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపీచంద్ అంటున్నాడు. "లాక్‌డౌన్‌లోనూ క్రీడాకారులు కసరత్తులు చేస్తున్నారు. బ్యాడ్మింటన్ కోర్టులు ఇంకా తెరవలేదు కాబట్టి క్రీడాకారులకు మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఆన్‌లైన్‌లో ఫిట్‌నెస్ సెషన్‌లు నిర్వహిస్తూ కొంత లోటును భర్తీ చేస్తున్నామంతే. స్టేడియాలు తెరిస్తే క్రీడాకారులు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించేందుకు 4 నుంచి 6 వారాల సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఫోన్, ఆన్‌లైన్ ద్వారా క్రీడాకారులకు అందుబాటులో ఉంటున్నా"నని గోపీచంద్ తెలిపాడు.