ఒలింపిక్స్ ట్రయల్స్ కోసం పట్టుబట్టిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ వ్యాఖ్యలపై స్పందించింది స్టార్ బాక్సర్ మేరీకోమ్. నిఖత్‌ను ఎదుర్కొనేందుకు భయపడట్లేదని చెప్పింది. ఒకవేళ ట్రయల్స్ నిర్వహించినా అవి నామమాత్రమేనని.. ఎందుకంటే గెలుపు తనదేనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.
"ఒలింపిక్స్ అర్హత పోటీలకు బాక్సర్లను ఎంపిక చేసే నిర్ణయం బాక్సింగ్ ఫెడరేషన్‌దే. వాళ్లు ఏం చెబితే అదే చేస్తా. ఆమె(నిఖత్ జరీన్)ను ఎదుర్కొనేందుకు భయపడట్లేదు. ఎన్నోసార్లు నిఖత్‌ను ఓడించా. ట్రయల్స్ నిర్వహించినా అవి నామమాత్రమే. ఎందుకంటే గెలుపు నాదే. ఇలాంటి సవాళ్లకు నేను భయపడను. బీఎఫ్ఐదే అంతిమ నిర్ణయం" - మేరీకోమ్, భారత బాక్సర్.
చాలా మంది తనను చూసి ఈర్ష్య పడుతున్నారని చెప్పింది బాక్సర్ మేరీకోమ్.
"ఇలాంటి ఘటనలు నాకు గతంలోను జరిగాయి. రింగులో ఎలా ప్రదర్శన చేశామనేది ముఖ్యం. స్వర్ణాలతో తిరిగొస్తామనే బీఎఫ్ఐ.. మమ్మల్ని ఎక్స్పోజర్ ట్రిప్స్‌కు పంపిస్తుంది. నిఖత్‌కు మంచి భవిష్యత్తు ఉంది. ఆటపై దృష్టి పెట్టి కొంచెం అనుభవం సంపాదించాలి. నేను ఈ స్థాయికి రావడానికి 20 ఏళ్లుగా కష్టపడుతున్నా. సవాల్ చేయడం సులభమే.. కానీ ప్రదర్శనే కష్టం" -మేరీ కోమ్, భారత బాక్సర్.
నిఖత్ జరీన్‌కు మద్దతుగా నిలిచిన అభినవ్ బింద్రాపైనా విమర్శనాస్త్రాలు సంధించింది మేరీ కోమ్.
"అభినవ్ బింద్రా.. ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలిచి ఉండొచ్చు. నేనూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సొంతం చేసుకున్నా. ఈ అంశంతో అతడికి సంబంధం లేదు. బాక్సింగ్‌లో తలదూర్చడం అతడి పనికాదు. నేను షూటింగ్ గురించి మాట్లాడలేదు. అతడు ఈ విషయంపై నిశబ్దంగా ఉంటే మంచిది. బింద్రాకు బాక్సింగ్‌లో ఎలాంటి నియమాలు ఉంటాయో తెలియదు. ప్రతి షూటింగ్ టోర్నీకి ముందు అతడు ట్రయల్స్‌లో పాల్గొన్నాడని నేను అనుకోవడం లేదు" - మేరీ కోమ్, భారత బాక్సర్
ఒలింపిక్స్ ట్రయల్స్ కోసం సెలక్షన్ నిర్వహించకుండా మేరీకోమ్‌ను నేరుగా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు పంపాలనుకుంటున్న భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) తీరును తప్పుపట్టింది హైదరాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్. తనకు న్యాయం చేయాలంటూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాసింది. రష్యా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ సెలక్షన్ నిర్వహిస్తామని చెప్పి.. మేరీని టోర్నీకి పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: 'మేరీనే తీసుకోవాలనుకుంటే నేనెందుకు ఆడడం'