ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన క్రీడగా ఫుట్‌బాల్ పేరుపొందింది. ఫుట్‌బాల్‌కు 350 కోట్ల మంది అభిమానులు ఉంటే, క్రికెట్‌కు 250 కోట్ల మంది ఉన్నారని క్రీడా వెబ్‌సైట్ల అంచనా. ముఖ్యంగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నిర్వహించే ప్రపంచకప్ ఫుట్‌బాల్‌కు వీక్షకులు భారీ సంఖ్యలో ఉంటారు. ఈ విషయంలో ఒక్క ఒలింపిక్స్ మాత్రమే దానితో పోటీ పడుతుంది. ఈ ఏడాది ఫిఫా పుట్‌బాల్ పోటీలు నవంబరు 20న ఖతార్‌లో మొదలయ్యాయి. డిసెంబరు 18 వరకు జరిగే ఈ టోర్నమెంటు అత్యంత ఖరీదైనదిగా రికార్డులకెక్కింది.
ప్రస్తుత సంవత్సరం ఖతార్ జీడీపీ 18,000 కోట్ల డాలర్లు. ఫిఫా ఫుట్‌బాల్ పోటీలపై ఖతార్ ఏకంగా 22,000 కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది. 1930లో ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ప్రారంభమైన తరవాత ఇంత భారీగా ఖర్చు చేసిన దేశం మరొకటి లేదు. ఖతార్‌లో ప్రపంచ కప్ ఫుట్‌బాల్ నిర్వహిస్తామని ఫిఫా 2010లో ప్రకటించింది. అప్పటి నుంచి ఖతార్ తన జీడీపీలో ఏటా 10శాతాన్ని క్రీడా నిర్వహణకు ఖర్చు చేస్తూ వస్తోంది. గడచిన 21 ఫిఫా ఫుట్‌బాల్ పోటీలన్నింటికీ కలిపి అయిన ఖర్చుకన్నా ఎన్నోరెట్లు ఎక్కువ నిధులను దోహా వెచ్చించింది. 2014లో బ్రెజిల్ ఈ పోటీలకు 1500 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. 2018లో రష్యా 1160 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఫిఫా పోటీల కోసం స్టేడియాలు, హోటళ్ల నిర్మాణం, రవాణా, టెలికమ్యూనికేషన్ సౌకర్యాల కల్పన, భద్రత కోసం ఖతార్ డబ్బును మంచినీళ్లలా వ్యయం చేసింది.
చమురు నిల్వలతో సుసంపన్నమైన ఖతార్‌కు ఫిఫా పోటీల కోసం భారీగా ఖర్చు చేసే స్తోమత ఉన్నా, దానివల్ల ఆ దేశానికి చివరకు ఒనగూడే ప్రయోజనమెంత అనేది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి ఇప్పటికైతే ఖతార్‌కు లాభాలేమీ సిద్ధించవు. నెలరోజులపాటు ప్రపంచ కప్ ఫుట్‌బాల్ నిర్వహణకు అయ్యే 170 కోట్ల డాలర్ల వ్యయాన్ని ఫిఫాయే భరిస్తుంది. అయితే, టికెట్ అమ్మకాలు, అంతర్జాతీయ టెలివిజన్ ప్రసార హక్కులు, కార్పొరేట్ ప్రాయోజకుల ద్వారా లభించే 470 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఫిఫా తన జేబులో వేసుకుంటుంది. అంటే ఫిఫా నికరంగా 300 కోట్ల డాలర్ల లాభం కళ్లజూస్తుంది. ఫుట్‌బాల్ పోటీలను చూడటానికి వచ్చే ప్రేక్షకులందరూ తనకు మాత్రమే కామధేనువులు అన్నట్లు ఫిఫా ప్రవర్తిస్తుంది. ప్రేక్షకులకు వస్తువులు విక్రయించడానికి ఫుట్‌బాల్ స్టేడియాల వద్ద చిన్న వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న అంగళ్లను తొలగించాలంటూ 2014లో బ్రెజిల్ ప్రభుత్వాన్ని ఫిఫా డిమాండు చేయడం దీనికి నిదర్శనం.
ఫిఫా ఫుట్‌బాల్ పోటీల కోసం ఖతార్ 650 కోట్ల డాలర్లతో ఎనిమిది స్టేడియాలు నిర్మించింది. కేవలం 28 లక్షల జనాభా గల ఆ చిన్న దేశానికి అన్ని క్రీడా మైదానాలు అవసరం లేదు. ఫిఫా పోటీలు ముగిసిన తరవాత వాటిలో మూడింటిని అంతర్జాతీయ క్రీడలకు కేటాయించి, మిగిలిన వాటిని కూలగొట్టడమో, కుదించడమో, ఇతర పనులకు ఉపయోగించడమో చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ప్రపంచ కప్ ఫుట్‌బాల్ కోసం ఖతార్ వెచ్చించిన నిధుల్లో చాలా భాగం క్రీడేతర మౌలిక వసతుల నిర్మాణానికి తోడ్పడ్డాయి. ఖతార్ జాతీయ విజన్-2030లో భాగంగా మెట్రో రైల్వే, సరికొత్త నగరం, నూతన అంతర్జాతీయ విమానాశ్రయం, రేవు, వేల కిలోమీటర్ల కొత్త రహదారులు, 100కు పైగా హోటళ్లను నిర్మించారు. ఫిఫా పోటీలు ముగిసిన తరవాతా ఈ మౌలిక వసతులు అంతర్జాతీయ పెట్టుబడిదారులను, కొత్త పరిశ్రమలను ఖతార్ వైపు ఆకర్షిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ఏడాది తొలి 10 నెలల్లోనే ఖతార్‌కు 400 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు ప్రవహించాయి. ఫుట్‌బాల్ పోటీల నిర్వహణ వల్ల ఈ ఏడాది చివరకు దోహా జీడీపీ వృద్ధి రేటు 4.1శాతానికి పెరుగుతుందని అంచనా. ఖతార్‌లో గడచిన నాలుగేళ్లలో అంకుర సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బాగా వృద్ధి చెందాయి. మరోవైపు, 2010 నుంచి ఈ స్టేడియాల నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరనే ప్రశ్న అనివార్యంగా తలెత్తుతోంది. ఫుట్‌బాల్ పోటీల కోసం మౌలిక వసతులను నిర్మిస్తూ 2010-2020 మధ్య ఖతార్‌లో 6,500 మంది వలస కూలీలు మరణించారని గార్డియన్ పత్రిక వెల్లడించింది. వారంతా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలకు చెందినవారే. దీనిపై మానవ హక్కుల సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. మొత్తంమీద ఖతార్ ఫుట్‌బాల్ సంరంభం చీకటి వెలుగుల బంతాటే!
ఇదీ చూడండి: ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్స్‌లోకి క్రొయేషియా.. షూటౌట్లో జపాన్‌పై విజయం