సంచలనం సృష్టించిన రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీ పేర్లను కేంద్రం వెల్లడించింది. బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల పర్యవేక్షణ కమిటీలోని పేర్లను తెలిపింది. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య-డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఇతర కోచ్‌లను ఈ కమిటీ విచారించనుంది.
దీంతో పాటు వచ్చే నెలకు సంబంధించి డబ్ల్యూఎఫ్ఐ రోజువారీ కార్యకలాపాలను కూడా ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ఒలింపిక్ మెడల్ విజేత యోగేశ్వర్ దత్, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తృప్తి ముర్గుండే, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధికా శ్రీమన్ టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ స్కీమ్ మాజీ సీఈఓ రాజగోపాలన్‌లు ఈ కమిటీలో మిగిలిన సభ్యులుగా ఉన్నారు.
డబ్ల్యూఐఎఫ్ అధ్యక్షుడు, భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్.. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని దిల్లీ జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు 3 రోజులు ఆందోళన చేపట్టారు. దీంతో దిగివచ్చిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, రవి దహియాలతో చర్చలు జరిపి కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ఫుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి అలా.. ఫ్యాన్స్ షాక్!