ETV Bharat / sports

హోరాహోరీగా ప్రపంచకప్ ఫైనల్.. విశ్వవిజేతగా అర్జెంటీనా - ప్రపంచ కప్ ఫుట్‌బాల్ 2022

ప్రపంచకప్​కు సిసలైన ముగింపు. సమ ఉజ్జీవుల పోరులో మునివేళ్లపై నిలబెట్టే ఉత్కంఠ.. ఫైనల్​లో తిరుగులేని ప్రదర్శనతో చెలరేగిపోయాయి అర్జెంటీనా, ఫ్రాన్స్.

FIFA World cup 2022 final arjentina vs france

author img

By

Published : Dec 18, 2022, 11:11 PM IST

Updated : Dec 19, 2022, 6:11 AM IST

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆరంభం కాబోతోంది..

ఫ్రాన్స్‌ ఒకవైపు.. మిగతా ప్రపంచం ఇంకోవైపు!

ఆ రెండోవైపున్న ప్రపంచమంతా ఒకటే నామస్మరణ!

మెస్సి.. మెస్సి.. మెస్సి..!

ఆట మొదలయ్యాక కూడా అంతటా అతనే..! 23వ నిమిషంలోనే అర్జెంటీనాకు పెనాల్టీ. అతడికి కాక ఎవరికిస్తారు కిక్‌ కొట్టే అవకాశం? బంగారం లాంటి అవకాశాన్ని అతను మాత్రం ఎలా వదిలేస్తాడు?

అర్జెంటీనా 1-0

ఇంకో 13 నిమిషాలకే అర్జెంటీనా మరో అవకాశం సృష్టించుకుంది. ఈసారి కూడా హీరో అతడే. రెప్పపాటులో ఫ్రాన్స్‌ డిఫెండర్లను మాయ చేస్తూ అతడిచ్చిన అద్భుత పాస్‌ను సద్వినియోగం చేస్తూ సహచరుడు కొట్టేశాడు గోల్‌.

అర్జెంటీనా 2-0

సగం ఆటైనా అవ్వలేదు. అప్పుడే పూర్తి పైచేయి. 80వ నిమిషం వరకు కూడా అదే ఆధిక్యం. ఫ్రాన్స్‌ అప్పటికీ సున్నానే!

మ్యాచ్‌ అదే స్థితిలో కొనసాగి, అర్జెంటీనా గెలిచేసి ఉంటే.. ఈ ప్రపంచకప్‌ ఫైనల్‌ అన్ని మిగతా ఫైనళ్లలో ఒకటిగా మాత్రమే ఉండేది! కానీ దశాబ్దాల తర్వాత కూడా దీని గురించి మాట్లాడుకునేలా ఈ పోరుకు ‘పతాక’ స్థాయిని అందించింది ఆ తర్వాతి డ్రామానే!

మెస్సి, రొనాల్డోల వీడ్కోలు వేళ.. వారి వారసత్వాన్ని కొనసాగించే నవతరం సూపర్‌స్టార్‌ తానేనని మరోసారి చాటి చెబుతూ కిలియన్‌ ఎంబాపె సంచలనం రేపాడు. నమ్మశక్యం కాని రీతిలో 97 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టేశాడు.

కానీ కెరీర్‌ చరమాంకంలో ప్రపంచకప్‌ గెలవడానికి వచ్చిన సువర్ణావకాశాన్ని మెస్సి అంత సులువుగా వదిలేస్తాడా? అదనపు సమయంలో అతను మళ్లీ అద్భుతం చేశాడు. జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఇంకో పన్నెండు నిమిషాల ఆటే మిగిలింది. ఉత్కంఠకు ఇప్పుడైనా తెరపడుతుందా అనుకుంటే.. కానీ మెస్సి ఆరాధకుల పాలిట ‘విలన్‌’లా మారిన పోరాట యోధుడు ఎంబాపె ‘నిన్నొదల’ అంటూ మళ్లీ వచ్చాడు. గోల్‌ కొట్టేశాడు.

స్కోరు 3-3.. ఫలితం తేల్చడానికి పెనాల్టీ షూటౌట్‌!

ఇవేం మలుపులు బాబోయ్‌.. ఇదేం ఉత్కంఠరా నాయనా అనుకుంటూ.. ప్రపంచమంతా రెప్పవేయడం మరిచి.. ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ.. షూటౌట్లోనూ అర్జెంటీనాను ముందుండి నడిపించాడు మెస్సి. అంతలోనే ఎంబాపె ‘కిక్‌’కు సిద్ధమవడంతో తీవ్ర ఉత్కంఠ! ఆ యోధుడు మళ్లీ మెస్సికి తాను సమవుజ్జీననిపించాడు. కానీ ఫ్రాన్స్‌ రెండో ప్రయత్నం గురి తప్పింది. అర్జెంటీనా ఉత్సాహం రెట్టింపైంది. ఆ జట్టిక ఆగలేదు. కప్పును వదల్లేదు!

దశాబ్దాల అర్జెంటీనా నిరీక్షణకు తెరదించుతూ.. తన ఉజ్వల కెరీర్‌కు అత్యద్భుతమైన ముగింపునిస్తూ.. ప్రపంచకప్పుల్లోకెల్లా ఉత్తమోత్తమం అనిపించేలా సాగిన 2022 కప్పును అందుకుని పీలే, మారడోనాలున్న ‘ఆల్‌టైం గ్రేట్‌’ క్లబ్బులో సగర్వంగా అడుగు పెట్టాడు మెస్సి!

అర్జెంటీనా మూడున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. సూపర్‌స్టార్‌ మెస్సి స్వప్నం సాకారమైంది. అనేక మలుపులతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. అభిమానులను ఉర్రూతలూగించిన పోరులో అర్జెంటీనా షూటౌట్లో 4-2తో పైచేయి సాధించింది. అర్జెంటీనా తరఫున మెస్సి రెండు గోల్స్‌ (23 పెనాల్టీ, 108 పెనాల్టీ) గోల్స్‌ కొట్టగా.. డిమారియా (36వ) ఓ గోల్‌ సాధించాడు. ఫ్రాన్స్‌ తరఫున స్టార్‌ ఆటగాడు ఎంబాపె సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ.. మొత్తం మూడు గోల్సూ (80 పెనాల్టీ, 81వ, 118 పెనాల్టీ) అతడే కొట్టినా జట్టును గెలిపించుకోలేకపోయాడు. అర్జెంటీనా చివరిసారి 1986లో మారడోనా నేతృత్వంలో ప్రపంచకప్‌ సాధించింది. మొత్తంగా ఆ జట్టు మూడోసారి జగజ్జేతగా నిలిచింది.

అర్జెంటీనా జోరు: సమవుజ్జీల పోరు అత్యంత హోరాహోరీ సాగుతుందని ఫుట్‌బాల్‌ ప్రపంచమంతా భావించింది. కానీ తుది సమరానికి ఆశ్చర్యకర ఆరంభం. అర్జెంటీనా అన్ని విభాగాల్లోనూ పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. ఫ్రాన్స్‌ తేలిపోయింది. చురుగ్గా కదిలిన అర్జెంటీనా పదే పదే దూసుకొస్తూ ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఒత్తిడికి గురి చేసింది. అంతా ఊహించినట్లే సూపర్‌స్టార్‌ మెస్సి.. ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తూ కాళ్లతో మాయ చేశాడు. ఫ్రాన్స్‌ అనూహ్యంగా మందకొడిగా సాగింది. ఆ జట్టులో జోష్‌ లేదు. ప్రత్యర్థి బాక్స్‌లోకి చొచ్చు కెళ్లిందీ లేదు. ప్రథమార్థంలో నెట్‌పై ఒక్క ఎటాకైనా చేసిందీ లేదు. ఎంబాపె సహా ఫ్రాన్స్‌ ఫార్వర్డ్‌ల ప్రభావమే కనపడలేదు. అర్జెంటీనా ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. మూడు మ్యాచ్‌ల తర్వాత ఆరంభ జట్టులో అవకాశం దక్కించుకున్న వెటరన్‌ వింగర్‌ డిమారియా మెస్సి, అల్వారెజ్‌తో కలిసి ఎటాకింగ్‌తో తన పాత్రను సమర్థంగా నిర్వర్తించాడు. 17వ నిమిషంలో అర్జెంటీనాకు ఓ మంచి అవకాశం లభించింది. కానీ డిమారియా షాట్‌ ప్రత్యర్థి బార్‌పై నుంచి వెళ్లింది. ప్రయత్నాన్ని కొనసాగించిన అర్జెంటీనా కాసేపటికే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పెనాల్టీని మెస్సి సద్వినియోగం చేశాడు. ఇందులో డిమారియా పాత్ర ఉంది. డిమారియా ప్రత్యర్థి బాక్స్‌లోకి వేగంగా దూసుకెళ్లగా.. డెంబెలె (ఫ్రాన్స్‌) అతణ్ని పడేయడంతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ ఇచ్చాడు. మెస్సి అలవోకగా ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ లోరిస్‌ను బోల్తా కొట్టించాడు. అంతే అర్జెంటీనా సంబరాల్లో మునిగిపోయింది. ఫ్రాన్స్‌ జోరు పెంచడానికి ప్రయత్నించినా.. ప్రత్యర్థి అర్ధభాగంలో బంతిని నియంత్రణలో ఉంచుకోలేకపోయింది. అంతలోనే ఆ జట్టుకు మరో షాక్‌. 36వ నిమిషంలో డిమారియా గోల్‌తో అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మెరుపుతో వేగంతో ఆ జట్టు గోల్‌ సాధించింది. మెస్సి నుంచి చక్కని ఫ్లిక్‌ అందుకున్న అల్వారెజ్‌ దాన్ని అలిస్టర్‌కు పంపాడు. అతడి నుంచి బంతి అందుకున్న డిమారియా గోల్‌ కొట్టేశాడు. తర్వాత కూడా ఫ్రాన్స్‌ను ఒత్తిడికి గురి చేసిన అర్జెంటీనా అత్యంత సంతృప్తిగా విరామానికి వెళ్లింది.

.

97 సెకన్లలో...: ద్వితీయార్ధాన్ని కూడా అర్జెంటీనా దూకుడుగా ఆరంభించింది. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఎటాక్‌లు కొనసాగించింది. ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌కు పని కల్పించింది. అయితే క్రమంగా ఫ్రాన్స్‌ దూకుడు పెంచడంతో అర్జెంటీనాకు సమస్యలు మొదలయ్యాయి. అయినా 79వ నిమిషాల తర్వాత కూడా అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలో ఉండడంతో ఆ జట్టు గెలుపు ఖాయమే అనిపించింది. కానీ అర్జెంటీనాకు శరాఘాతం. 97 సెకన్ల వ్యవధిలో ఆట స్వరూపమే మారిపోయింది. స్టార్‌ ఆటగాడిగా తనపై భారీ అంచనాలను సమంజసమే అని నిరూపిస్తూ చకచకా రెండు గోల్స్‌ కొట్టి ఫ్రాన్స్‌ను పోటీలోకి తెచ్చాడు ఎంబాపె. అర్జెంటీనా బాక్స్‌లో కోలో మౌనిని ఒటామెండి పడేయడంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది. దాన్ని ఎంబాపె (80వ నిమిషం) సద్వినియోగం చేశాడు. అర్జెంటీనా షాక్‌ నుంచి తేరుకునే లోపే ఎంబాపె మరో గోల్‌ కొట్టాడు. మిడ్‌ఫీల్డ్‌లో మెస్సి నుంచి బంతిని చేజిక్కించుకున్న కోమన్‌ ముందుకు వెళ్లాడు. బంతిని అందుకున్న ఎంబాపె.. తురమ్‌తో పరస్పరం పాసులు ఇచ్చుకుంటూ వెళ్లి ప్రత్యర్థి గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించాడు. ఫ్రాన్స్‌ జట్టు మెస్సి సేనను ఇంజురీ సమయంలో మరింత కలవరపెట్టింది. కానీ ఆ జట్టు ప్రయత్నాలను కాచుకున్న అర్జెంటీనా అడ్డుకోవడంతో ఆట అదనపు సమయానికి వెళ్లింది.

.

మళ్లీ ఆ ఇద్దరు..: అదనపు సమయం కూడా అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. 108వ నిమిషంలో గోల్‌తో మెస్సి అర్జెంటీనాను తిరిగి ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. లౌతారో మార్టినెజ్‌ షాట్‌ లోరిస్‌ అడ్డుకోగా.. వెనక్కి వచ్చిన బంతిని నెట్లోకి కొట్టేశాడు మెస్సి. ఇక అర్జెంటీనా గట్టెక్కుతుందనిపించింది. కానీ కథ అక్కడితో ముగియలేదు. మరికొన్ని నిమిషాల్లో అదనపు సమయం ముగుస్తుందనగా అర్జెంటీనా పెనాల్టీని సమర్పించుకుంది. దాన్ని ఎంబాపె సద్వినియోగం చేయడంతో స్కోరు 3-3తో సమమమైంది. ఉత్కంఠను మరింత పెంచుతూ ఆట షూటౌట్‌కు దారి తీసింది.

.

షూటౌట్లో: షూటౌట్లో అర్జెంటీనా గోల్‌కీపర్‌ ఎమిలియానో మార్టినెజే హీరో. ఫ్రాన్స్‌ తరఫున మొదటి పెనాల్టీని ఎంబాపె సద్వినియోగం చేయగా.. ఆ తర్వాత అర్జెంటీనా తరఫున మెస్సి స్కోర్‌ చేశాడు. ఆ తర్వాత ఫ్రాన్స్‌ తరఫున కోమన్‌ (రెండో పెనాల్టీ), చౌమని (మూడో పెనాల్టీ) వరుసగా విఫలం కావడంతో అర్జెంటీనా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కోమన్‌ షాట్‌ను కుడివైపునకు దూకుతూ మార్టినెజ్‌ అడ్డుకోగా.. చౌమన్‌ షాట్‌ను బయటికి కొట్టాడు. అర్జెంటీనా తరఫున రెండు, మూడో ప్రయత్నాల్లో డిబలా, పరేదెస్‌ విజయవంతం కావడంతో ఆ జట్టు 3-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో పెనాల్టీని సద్వినియోగం చేయడం ద్వారా కోలో మౌని ఫ్రాన్స్‌ ఆశలను (2-3) సజీవంగా ఉంచాడు. కానీ తర్వాత మాంటియల్‌.. ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించడంతో ప్రపంచకప్‌ అర్జెంటీనా సొంతమైంది.

.

ఉత్తమ యువ ఆటగాడు- ఎంజో ఫెర్నాండెజ్‌ (అర్జెంటీనా)
బంగారు గ్లోవ్స్‌ (ఉత్తమ గోల్‌కీపర్‌)- ఇ.మార్టినెజ్‌ (అర్జెంటీనా)
బంగారు బూటు (అత్యధిక గోల్స్‌)- ఎంబాపె (ఫ్రాన్స్‌)
బంగారు బంతి (ఉత్తమ ఆటగాడు)- మెస్సి

.

అతడే హీరో..
ఫైనల్లో మొదట ఆధిక్యాన్ని అర్జెంటీనా నిలబెట్టుకోలేకపోయింది. ఆ జట్టు గోల్‌కీపర్‌ ఎమిలియానో మార్టినెజ్‌ మ్యాచ్‌లో ఎంబాపెను ఆపలేకపోయాడు. కానీ మిగతా ఆటగాళ్ల ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకున్నాడు. పెనాల్టీ షూటౌట్లో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకంగా మారాడు. కోమన్‌ ప్రయత్నాన్ని అడ్డుకుని జట్టుకు ఆధిక్యం సాధించే అవకాశం ఇచ్చాడు. క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌పై జట్టు విజయంలోనూ అతనే కీలక పాత్ర పోషించాడు. పెనాల్టీ షూటౌట్లో జట్టును గెలిపించి హీరోగా మారాడు.

.

ట్రోఫీని ఆవిష్కరించిన దీపిక
ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ప్రపంచకప్‌ ట్రోఫీని బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనె ఆవిష్కరించింది. లుసైల్‌ స్టేడియంలో స్పెయిన్‌ దిగ్గజ గోల్‌కీపర్‌, మాజీ కెప్టెన్‌ ఇకర్‌ కాసిలాస్‌తో కలిసి ఆమె ఓ పెట్టెను తెరిచి ట్రోఫీని బయటకు కనబడేలా చేశారు. అనంతరం ఈ ఇద్దరూ కలిసి దీన్ని మైదానంలో తీసుకెళ్లి పెట్టారు.

.

అర్జెంటీనాకు ప్రధాని మోదీ అభినందన
ప్రపంచకప్‌ గెలిచిన అర్జెంటీనా జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ‘‘ఈ ఫైనల్‌ అత్యంత రసవత్తర ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల్లో ఒకటిగా గుర్తుండిపోతుంది. ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన అర్జెంటీనాకు అభినందనలు. టోర్నీ ఆసాంతం ఆ జట్టు గొప్పగా ఆడింది. భారత్‌లో కోట్ల మంది మెస్సి, అర్జెంటీనా అభిమానులు ఈ విజయాన్ని ఆస్వాదించారు’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ఫ్రాన్స్‌ కూడా టోర్నీలో బాగా ఆడిందని అన్నారు.

.

అమెరికా అందుకుంది
ఖతార్‌లో ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ సంబరం ముగిసింది. ఇక అందరి చూపూ అమెరికా మీదే. తర్వాతి ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వబోయేది ఈ అగ్రరాజ్యమే. మెక్సికో, కెనడాలతో కలిసి 2026 టోర్నీని అమెరికా నిర్వహించబోతోంది. ఈ మూడు దేశాల ప్రతినిధుల బృందం.. ఆదివారం 2022 ప్రపంచకప్‌ ఫైనల్‌ అనంతరం ఖతార్‌ నిర్వాహకుల నుంచి ఆతిథ్య బాధ్యతలను స్వీకరించింది. 2026 జూన్‌-జులై నెలల్లో అమెరికా, మెక్సికో, కెనడాల్లోని 16 నగరాల్లో సాకర్‌ ప్రపంచకప్‌ జరగనుంది.

1

ఓ ప్రపంచ కప్‌లో గ్రూప్‌ దశ, ప్రిక్వార్టర్స్‌, క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్స్‌లో గోల్‌ చేసిన తొలి ఆటగాడు మెస్సి.

3

పెనాల్టీ షూటౌట్లో ఫలితం తేలిన మూడో ఫైనల్‌ ఇది. గతంలో 1994 (బ్రెజిల్‌ × ఇటలీ), 2006 (ఇటలీ × ఫ్రాన్స్‌)లో ఇలాగే జరిగింది.

3

అర్జెంటీనాకిది మూడో ప్రపంచకప్‌. 1978, 1986లోనూ ఆ జట్టు విజేతగా నిలిచింది.

5

పీలే, బ్రెటినర్‌, వావా, జిదానె తర్వాత ఫిఫా ప్రపంచకప్‌లో ఒకటి కంటే ఎక్కువ ఫైనల్స్‌లో గోల్స్‌ చేసిన అయిదో ఆటగాడు ఎంబాపె. 2018లో క్రొయేషియాపై అతను ఓ గోల్‌ చేశాడు.

13

ఫిఫా ప్రపంచకప్‌ల్లో మెస్సి గోల్స్‌. అత్యధిక గోల్స్‌ జాబితాలో ఫాంటైన్‌తో కలిసి నాలుగో స్థానంలో ఉన్నాడు. మిరోస్లావ్‌ (జర్మనీ- 16), రొనాల్డో (బ్రెజిల్‌- 15), గెర్డ్‌ ముల్లర్‌ (జర్మనీ- 14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

26

ప్రపంచకప్‌ చరిత్రలో మెస్సి ఆడిన మ్యాచ్‌లు. అత్యధిక ప్రపంచకప్‌ మ్యాచ్‌లాడిన ఆటగాడిగా అతను.. జర్మనీ మాజీ ఆటగాడు లోథర్‌ (25)ను వెనక్కినెట్టాడు. అందులో అత్యధిక విజయాల్లో (17) మిరోస్లావ్‌ (జర్మనీ) సరసన చేరాడు.

6

ప్రపంచకప్‌ల్లో అర్జెంటీనా గెలిచిన పెనాల్టీ షూటౌట్ల్లు. ఆ జట్టుదే రికార్డు.

Last Updated : Dec 19, 2022, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.