ప్రతిపనికి రోబోలను తయారు చేసుకోగలిగే శక్తి ఉన్న కాలంలో మనం ప్రస్తుతం జీవిస్తున్నాం. కానీ, స్త్రీకి సంబంధించిన శారీరక ప్రక్రియ గురించి మాట్లాడేందుకు ఆ రోబోను కూడా అనుమతించని వాతావరణంలో పెరుగుతున్నాం. ఓవైపు సాంకేతికతతో ప్రపంచం పరుగులు తీస్తుంటే.. ఇలాంటి విషయాల గురించి మాట్లాడటానికి ఇప్పటికీ వెనకాడుతున్నాం. ఎందుకు? ఇదే మన సమాజంలో ఉన్న విచారకర వాస్తవం. కానీ, ఇప్పటికీ మహిళలు, మహిళా అథ్లెట్లు రుతుస్రావం ద్వారా సమాజంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఆన్లైన్ వేదికగా గత ఐదేళ్లుగా ఈ విషయమై చాలా మంది ప్రముఖులు చర్చించారు. దీని గురించి కొన్ని అవగాహన కార్యక్రమాలనూ చేపట్టారు. కానీ ఈ అంశంపై సమాజం మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఆధునిక సమాజంలో అవగాహన రావాల్సిన ఈ సమస్యపై 'ఈటీవీ భారత్'.. కొంతమంది మహిళా క్రీడాకారిణిలతో ప్రత్యేక చర్చ వేదికను నిర్వహించింది. ఇందులో భారత స్టార్ షట్లర్ జ్వాలా గుత్తా, మాజీ క్రికెటర్ రీమా మల్హోత్రా, పారాలింపియన్ కమిటీ అధ్యక్షురాలు దీపా మాలిక్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధా బావ్రే, మహిళా క్రికెట్ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ సుమన్ శర్మ, ఆంధ్రప్రదేశ్ మహిళల క్రికెట్ జట్టు ఫిజియోథెరపిస్ట్ ధారిని రోచాని, స్పోర్ట్స్ ప్రెజెంటర్ రిద్దిమా పాఠక్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో మహిళల సమస్యలతో పాటు రుతుస్రావం వల్ల అథ్లెట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి మాట్లాడారు.
ప్యానెల్ సభ్యుల భావాలు:
- "నాకు పీరియడ్స్ రావడం చాలా సాధారణమని భావిస్తాను. ఇది మా(మహిళల) జీవితంలో భాగమైనప్పటికీ.. వృత్తి పరంగా బ్యాడ్మింటన్ ప్రారంభించినప్పుడు కొన్నిసార్లు చాలా నొప్పిని భరించాను. కొన్నిసార్లు ఔషధాలను తీసుకోవాల్సి వచ్చింది. కానీ, దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. అది నన్ను బాధించలేదు. నిజాయితీగా చెప్పాలంటే నా పీరియడ్స్‌లోనూ ఉత్తమ ప్రదర్శన చేశాను. ఆడే ముందు రుతుస్రావం గురించి కలతచెందలేదు" అని భారత స్టార్ షట్లర్ జ్వాలా గుత్తా వెల్లడించారు.
- మాజీ క్రికెటర్ రీమా మల్హోత్రా స్పందిస్తూ.. "నేను పీరియడ్స్‌ను ఆలస్యం చేయడానికి కాకుండా త్వరగా రావడానికి కొన్ని సందర్భాలలో మందులు వాడాను. ఒకసారి నా వేలుకు గాయమైనప్పుడు నొప్పిని భరించేందుకు పెయిన్‌కిల్లర్స్ వాడాను. అవి నన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దాంతో ఆరు నెలలు పీరియడ్స్ రాలేదు. ఆ సమయంలో రుతుస్రావం వచ్చేందుకు ట్యాబ్లెట్స్ వాడాల్సివచ్చింది. పీరియడ్స్‌తో సంబంధం లేకుండా మ్యాచ్ ఆడటం మాత్రమే తెలుసు. కొన్నిసార్లు ఆటలో ఒత్తిడి కారణంగా నొప్పిని మరిచిపోతాను" అని తెలిపారు.
- "నా 36 ఏళ్ల వయసులో ఆటడం ప్రారంభించాను. అవును, నా శరీర దిగువ భాగంలో ఎలాంటి చలనం లేదు. నాకు ఎలాంటి నొప్పి లేదు. దాని గురించి నాకు ఎలాంటి బాధ లేదు. తిమ్మిరిగా మాత్రమే అనిపిస్తుంది" అని పారాలింపిక్ క్రీడాకారిణి దీపా మాలిక్ వెల్లడించారు.
- పీరియడ్స్ పట్ల క్రీడాకారిణులు ఎదుర్కొనే పరిస్థితులు, అమెనోరియా గురించి ప్రస్తావించారు ఫిజియోథెరపిస్టు ధరణి రోచాని. "అమెనోరియా అంటే మూడు నెలల పాటు పీరియడ్స్‌ను ఆపే విధానం. కొన్నిసార్లు, అథ్లెట్ల శిక్షణ కారణంగా పీరియడ్స్‌ను దాటవేస్తారు. ఆ మూడు నెలల తర్వాత రుతుస్రావం వచ్చినప్పుడు చాలా తక్కువగా లేదా చాలా భారీగా రక్తస్రావం అవుతుంది" అని తెలిపారు.