Pullela Gopichand: థామస్ కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు అద్భుత ప్రదర్శనపై గర్వంతో ఉప్పొంగిపోతున్నారు బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపిచంద్. ఈ విజయంతో దేశంలో బ్యాడ్మింటన్‌కు మరింత ఆదరణ పెరుగుతుందని ఆకాంక్షించారు. ఈటీవీ భారత్‌తో టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్నో ఎళ్ల శ్రమకు ఫలితం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
"ఈ విజయం భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తుకు ఎంతో ఉపకరిస్తుంది. థామస్ కప్ లాంటి టోర్నీని గెలవడం నిజంగా అద్భుతం. భారత జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు శక్తినంతా ధారపోసి ఆడారు. సాత్విక్, చిరాగ్ జోడి డబుల్స్ గెలవడం, లక్ష్య, శ్రీకాంత్ సింగిల్ గేమ్స్‌లో విజయం సాధించడం గొప్ప విషయం. ఈ టోర్నీలో ప్రణయ్ చాలా బాగా ఆడాడు. ఈ విజయం నా అత్యంత గొప్ప విజయాల్లో ఒకటి. ఇది వ్యక్తిగత విజయం కాదు. సమష్టిగా రాణించిన జట్టు విజయం. ఈ విజయం తర్వాత భారత్ కప్పు గెలిచింది అంటున్నారు. అంతేగానీ ఓ ఆటగాడు కప్పు గెలిచాడని అనరు. అందుకే ఇది జట్టు విజయం. ఈ విజయోత్సాహంతో భారత బ్యాడ్మింటన్ జట్టు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేస్తుంది. "
-పుల్లెల గోపిచంద్, భారత బ్యాడ్మింటన్ జాతీయ కోచ్
Thomos cup 2022 winner: ఆదివారం జరిగిన ఫైనల్లో థామస్ కప్ గెలిచి 43 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ చరిత్ర సృష్టించింది భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు. టోర్నీలో సెమీస్‌కు వెళ్లిన తొలిసారే కప్పు గెలిచి సత్తా చాటింది. ఈ విజయంతో దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరుగుతుందనే విశ్వాసం కలుగుతోంది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ విజయాన్ని ఈ మ్యాచ్ గుర్తుకు తెచ్చింది. భారత్‌లో ప్రస్తుతం క్రికెట్‌కు మాత్రమే అత్యంత ఆదరణ ఉంది. ఏదైనా మ్యాచ్ ఉంటే కోట్లాది మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఆదివారం మాత్రం బ్యాడ్మింటన్‌ను చూసేందుకు ప్రజలు అమితాసక్తి కనబరిచారు. సోషల్ మీడియాలో ఈ మ్యాచ్ చర్చనీయాంశమైంది. ఫైనల్లో భారత్ జట్టు ప్రదర్శనను అభిమానులు ఆస్వాదించారు. కప్పు గెలిచాక సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా భారత బ్యాడ్మింటన్ జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి జట్టు సభ్యులను అభినందించారు. కేంద్ర క్రీడా శాఖ ఆటగాళ్లకు రూ.కోటి నజరానా కూడా ప్రకటించింది.
ఇదీ చదవండి: భారత్ గెలిచిన ప్రతిష్టాత్మక 'థామస్' కప్ గురించి ఈ విషయాలు తెలుసా?