Deepika Pallikal sports: మూడేళ్లుగా రాకెట్ పట్టిందే లేదు.. ఆటకు దూరంగా కుటుంబానికి దగ్గరగా సమయం గడపడం.. కవలలకు జన్మనివ్వడం వల్ల తల్లిగా జీవితంలో కొత్త అధ్యాయం.. ఇక ఆమె తిరిగి కోర్టులో అడుగుపెడుతుందా? మళ్లీ రాకెట్ పట్టిన మునుపటిలా రాణిస్తుందా? అన్న ప్రశ్నలు.. కానీ వీటన్నింటినీ దాటి ఆ అమ్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ డబుల్స్ ఛాంపియన్‌షిప్స్‌లో ఏకంగా రెండు స్వర్ణాలు కొల్లగొట్టింది. ఆమే.. స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్. క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్య. ఆరు నెలల క్రితం కవలలకు జన్మనిచ్చిన ఆమె విరామం తర్వాత ఆడిన తొలి టోర్నీ ప్రపంచ డబుల్స్ ఛాంపియన్‌షిప్స్‌లో మహిళల డబుల్స్‌లో జోష్న, మిక్స్‌డ్ డబుల్స్‌లో సౌరభ్ ఘోషల్‌తో కలిసి ఛాంపియన్‌గా నిలిచింది. ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్, ఆసియా క్రీడల ముందు తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది.
"ఈ ఏడాది కామన్వెల్త్, ఆసియా క్రీడల ముందు లయ అందుకోవడం గొప్పగా ఉంది. ఓ ప్రత్యర్థిగా నన్ను చూసి అవతలి క్రీడాకారిణులు భయపడాలి. నేను తిరిగి కోర్టులో అడుగుపెట్టానని మాత్రమే కాదు అత్యుత్తమ ఆట ఆడుతున్నానని వాళ్లు అనుకోవాలి. నేనెప్పుడూ మానసికంగా చాలా బలంగా ఉంటా. నా లక్ష్యాల పట్ల స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతా. గెలవాలనే ధ్యేయంతోనే ప్రతి టోర్నీలో అడుగుపెడతా. ఆటనే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని దినేశ్, సౌరభ్ (తన సోదరి భర్త)కు చెప్తుండేదాన్ని. మా పిల్లలను చూసుకునేందుకు కుటుంబ సభ్యులు ఉండడం నా అదృష్టం. నాపై వీళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ పతకాలు గెలవడం ఇంకా ఆనందంగా ఉంది. గత మూడేళ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఈ విరామం వ్యక్తిగతంగా నన్ను మరింత దృఢంగా మార్చింది. అబ్బాయిలు పుట్టిన తర్వాతే మళ్లీ కోర్టులో అడుగుపెట్టాలనే పట్టుదల పెరిగింది. పిల్లలతో పాటు ఇంట్లోనే ఉండాలని చాలా మంది చెప్పారు. కానీ అలాంటి వాళ్లు తప్పు అని నిరూపించాలనుకున్నా. దినేశ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఈ సారి ప్రపంచ డబుల్స్ టోర్నీ సమయంలోనే ఐపీఎల్ ఉండడంతో పిల్లలకు మేమిద్దరం ఒకే సమయంలో దూరంగా ఉన్నాం. మా జీవితం మరింత కొత్తగా మారింది."
- దీపిక పల్లికల్, స్క్వాష్ క్రీడాకారిణి
మళ్లీ ఆడాలనుకోగానే సాధన మొదలెట్టానని.. లేకపోతే ఇప్పటికీ ఓ 15 కిలోలు అధిక బరువు ఉండేదాన్నని పేర్కొంది పల్లికల్. జోష్న తనకెప్పటి నుంచో తెలుసునని.. తన సోదరి భర్త సౌరభ్ మద్దతుగా నిలుస్తూనే ఉన్నట్లు గుర్తు చేసుకుంది దీపిక. అందుకే వాళ్లతో కలిసి ఆడడానికి ఇబ్బంది అనిపించలేదని పేర్కొంది. ప్రపంచ డబుల్స్‌లో ఇంగ్లాండ్ ప్లేయర్లను ఓడించడం గొప్పగా ఉందని.. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలు గెలవడమే ఇప్పుడు తన లక్ష్యమని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఆనందం డబుల్.. కవలలకు జన్మనిచ్చిన దీపిక