మల్లయోధుడు సాగర్ రానా హత్య కేసును దిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు తరలించనున్నారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం నార్త్‌వెస్ట్ డిస్ట్రిక్ట్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఈనెల 4న ఛత్రసాల్ స్టేడియం వద్ద రెండు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన కొట్లాటలో సాగర్ అనే 23 ఏళ్ల రెజ్లర్ మరణించాడు. ప్రముఖ స్టార్ రెజ్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ దాడి వల్లే సాగర్ చనిపోయాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి దిల్లీ కోర్టు ముందు హాజరుపరచగా 6 రోజుల పోలీసు కస్టడీ విధించింది న్యాయస్థానం.
అయితే ఈ దాడిలో సాగర్ చనిపోవడం సహా అతడి స్నేహితులు సోనూ, అమిత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. సోనూ గ్యాంగ్‌స్టర్ కాలా జథేరీ మేనల్లుడు. కాబట్టి ఈ కేసు మరింత బలంగా తయారైంది. గ్యాంగ్‌స్టర్, సుశీల్ మధ్య ఏమైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
ఉరి తీయాలని డిమాండ్
తమ కుమారుడి మృతికి కారణమైన రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఉరితీయాలని సాగర్ రాణా తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసును న్యాయంగా దర్యాప్తు చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని అతడు తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తాడని ఆరోపించారు. అతడి వద్ద నుంచి పతకాలు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
నేరస్థులతో సుశీల్ సంబంధాలపై దర్యాప్తు చేయాలని సాగర్ తండ్రి అశోక్ కోరారు. "న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. పారిపోయినప్పుడు సుశీల్ ఎక్కడున్నాడు? అతడికి ఎవరు ఆశ్రయమిచ్చారు? గ్యాంగ్‌స్టర్లతో అతడికున్న సంబంధాలపై దర్యాప్తు చేయాలి. అతడిని ఉరి తీయాలి. తన సొంత విద్యార్థులనే చంపేవారికి అదో పాఠం కావాలి" అని ఆయన అన్నారు.