టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేయడం జరగదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు(ఐఓసీ) థామస్ బాచ్ ఆదివారం తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా నియంత్రణలో భాగంగా టోర్నీని వాయిదా వేసే అవకాశం ఉందని అన్నారు.
"ఒలింపిక్స్‌ను రద్దు చేయడం వల్ల ఏ సమస్యలను పరిష్కరించలేం. అందువల్ల టోర్నీని రద్దు చేయడం కుదరదు. ఈ విషయంపై జపాన్ ప్రభుత్వంతో కలిసి టోర్నీ నిర్వాహక కమిటీ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేస్తుంది. వచ్చే నాలుగు వారాల్లో ఈ విషయంపై ఓ స్పష్టత వస్తుందని ఐఓసీ నమ్మకంగా ఉంది."
- థామస్ బాచ్, ఐఓసీ అధ్యక్షుడు
కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్ వాయిదా పడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని తెలిపారు జపాన్ ప్రధానమంత్రి షింజో అబే. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కొన్ని వారాలు పరిస్థితిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని కొన్ని రోజులుగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు పెరుగుతున్న క్రమంలో క్రీడాకారుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి.. 'మహిళా అథ్లెట్లకు సమాన వేతనాలు ఇవ్వాలి'