బుమ్రా (6/19) దెబ్బకు తొలి వన్డేలో ఇంగ్లాండ్ కుప్పకూలింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ఎదుట 111 పరుగుల స్వల్ప లక్ష్యం నిర్దేశించింది. ఇందులో నలుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. జోస్ బట్లర్ (30), డేవిడ్ విల్లే (21), కార్సే (15), మొయిన్ అలీ (14) మాత్రమే రెండంకెల స్కోరును నమోదు చేశారు. మిగతావారిలో బెయిర్‌స్టో 7, ఓవర్టన్ 8, టోప్లే 6(నాటౌట్) పరుగులు చేయగా.. జాసన్ రాయ్, జో రూట్, స్టోక్స్, లివింగ్‌స్టోన్ డకౌట్‌గా వెనుదిరిగారు. భారత బౌలర్లలో బుమ్రా కాకుండా షమీ 3, ప్రసిధ్ ఒక వికెట్ తీశారు. బుమ్రాకిది రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. ఈ మ్యాచ్‌లోనే షమీ అరుదైన మైలురాయిని అందుకొన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా అవతరించాడు. అదేవిధంగా భారత్ తరఫున పేసర్లే అన్ని వికెట్లను పడగొట్టడం ఇది ఆరోసారి. మొదట బౌలింగ్ ఎంచుకున్నప్పుడు ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇదీ చదవండి: Mo Farah: మోసం నుంచి పుట్టుకొచ్చిన ఒలింపిక్ వీరుడు.. ఆ పరుగు వెనక పుట్టెడు దు:ఖం