భారత సైనికాధికారి లెఫ్ట్‌నెంట్ కర్నల్ భరత్ పన్ను అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలో అత్యంత కఠినమైన రేసుల్లో ఒకటైన రేస్ అక్రాస్ అమెరికా (రామ్)ను పూర్తి చేశారు. ఈ రోడ్ సైక్లింగ్ రేసును టూర్ డి ఫ్రాన్స్‌తో పోల్చవచ్చు. కానీ మహమ్మారి కారణంగా రేసును ఈసారి వర్చువల్‌గా నిర్వహించారు.
ప్రపంచ వ్యాప్తంగా సైక్లిస్టులు ఇండోర్ నుంచే పోటీలో పాల్గొన్నారు. అయినా వాళ్లు పడ్డ శ్రమ తక్కువేమీ కాదు. నిర్ణీత సమయంలో రేసును పూర్తి చేయడానికి వాళ్లు నిద్ర సమయాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది.
"బయట అయితే సీటు నుంచి లేచి శరీరాన్ని అటు ఇటూ కదపొచ్చు. సైకిల్ ఫ్రేమ్ ఓ స్టాండ్‌కు బిగించి ఉండడం వల్ల ఇండోర్‌లో ఆ అవకాశం లేదు" అని పన్ను చెప్పారు. నాలుగు వేల కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కిన పన్ను.. 12 రోజుల తర్వాత ఆదివారం సాయంత్రం రేసు పూర్తి చేశారు. రేసు ఆరంభంలో 38 గంటలపాటు సైక్లింగ్ చేశాక తొలి నిద్ర విరామం తీసుకున్నారు. అది కూడా 90 నిమిషాలే. 12 రోజుల్లో అతడు మొత్తం 11 నిద్ర విరామాలు (90 లేదా 180 నిమిషాలు) మాత్రమే తీసుకున్నారు.
పన్ను పుణె నుంచి రేసులో పాల్గొన్నాడు. 24 గంటలూ అతడి కదలికలను రికార్డు చేయడానికి కెమెరాలను ఏర్పాటు చేశారు. చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం రేసు పూర్తయ్యాకే కర్నల్ భరత్ పన్నుకు తెలిసింది. మొత్తం 22 మంది పోటీ పడ్డ రేసులో పన్ను మూడో స్థానంలో నిలిచారు. మూడు దశాబ్దాలపై రేసు చరిత్రలో అతడి కన్నా ముందు ముగ్గురు భారతీయులే రేసు పూర్తి చేశారు.