టోక్యో ఒలింపిక్స్ రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే 3.5 లక్షల సంతకాలతో ఓ ఆన్లైన్ పిటిషన్ను టోక్యో ప్రభుత్వానికి ఒలింపిక్స్ వ్యతిరేక ఆందోళనకారులు శుక్రవారం సమర్పించారు. కొత్త వేరియంట్లతో టోక్యో, ఒసాక సహా పలు ప్రాంతాల్లో కరోనా విలయం సృష్టిస్తోన్న వేళ.. విశ్వ క్రీడలు జరపొద్దని డిమాండ్ చేశారు.
ఈ పిటిషన్ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్, అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్కు పంపనున్నారు. ఈ వ్యాజ్యాన్ని టోక్యో గవర్నర్ పదవికి పలుసార్లు పోటీచేసిన న్యాయవాది కెంజీ ఉట్సునోమియా వాదించనున్నారు.
గతేడాదే జరగాల్సిన ఈ మెగా టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు పోటీలు జరగనున్నాయి.
దాదాపు 80 శాతం మంది జపాన్ వాసులు టోర్నీని రద్దు చేయాలని పలు సర్వేల్లో అభిప్రాయపడ్డారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహిస్తామని జపాన్ ప్రధాని యోషిహిదే సుగా సహా నిర్వాహకులు చెప్పడం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఇదీ చూడండి: 'డబ్ల్యూటీసీ టైటిల్ టీమ్ఇండియాకు కష్టమే'