పన్నెండేళ్ల వయసులో పిల్లలు మహా అయితే ఏం చేస్తారు? ఇంట్లో అల్లరి చేస్తూ.. సరదాగా ఆటలాడేస్తారు. కానీ న్యూజెర్సీకి చెందిన అభిమన్యు మిశ్రా మాత్రం ఆటతోనే చరిత్ర తిరగరాశాడు. 12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న అతను.. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సులో ఆ ఘనత సాధించిన చెస్ ఆటగాడిగా కర్జాకిన్ (12 ఏళ్ల 7 నెలలు) రికార్డును బద్దలు కొట్టాడు. భారత సంతతి తల్లిదండ్రులకు పుట్టిన ఈ అమెరికా బాలుడు.. చదరంగంలో మనకు తిరుగులేదని మరోసారి చాటాడు. చెస్ బోర్డుపై బాల్యంలోనే ప్రేమ పెంచుకుని అరంగేట్రం నుంచే రికార్డుల వేటలో దూసుకెళ్తున్నాడు. 9 ఏళ్లకే యూఎస్ అతి పిన్న వయస్సు జాతీయ చెస్ మాస్టర్‌గా నిలిచాడు. 10 ఏళ్ల 9 నెలలకే అతి పిన్న అంతర్జాతీయ మాస్టర్‌గా నిలిచి భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రికార్డును చెరిపేశాడు. ఇప్పుడదే జోరులో తక్కువ వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదా సొంతం చేసుకున్నాడు. కరోనా కారణంగా ఏడాది పాటు ఆటకు దూరం కాకుండా ఉంటే మరింత తక్కువ వయసులోనే అతనీ రికార్డు సాధించేవాడు.
రెండున్నరేళ్లకే..
మధ్యప్రదేశ్‌కు చెందిన హేమంత్, స్వాతి దంపతులు 2006లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. తమ కొడుకు అభిమన్యును చెస్ ఛాంపియన్‌గా చూడాలనేది వాళ్ల కల. ఆ పిల్లాడికి పూర్తిగా మాటలు కూడా రాకముందే.. రెండున్నరేళ్లకే తన తండ్రి కథలు చెబుతూ చదరంగ పావులను పరిచయం చేశాడు. అలా 64 గళ్లపై అతనికి ప్రేమ కలిగింది. అయిదేళ్లు వచ్చేసరికే తండ్రిని ఓడించే స్థాయికి చేరాడు. ఆ తర్వాత అకాడమీలో చేరి పావులపై పట్టు సాధించాడు. తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో, ఆలోచనలతో ప్రత్యర్థులను చిత్తుచేయడం మొదలెట్టాడు. తనకంటే ఎంతో పెద్దవాళ్లతో పోటీపడి విజయాలు సాధించాడు. అండర్-9 విభాగంలో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ కలిగిన ఆటగాడిగా నిలిచిన అతనికి దిగ్గజం కాస్పరోవ్ చెస్ ఫౌండేషన్ నుంచి ఆహ్వానం అందింది. ఆ సంస్థ నిర్వహిస్తున్న యంగ్ స్టార్స్ కార్యక్రమానికి అతను ఎంపికయ్యాడు. దీంతో అప్పటి నుంచి అతని ఆటతీరును పరిశీలించి ఏడాదికి రెండు సార్లు కాస్పరోవ్ తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నాడు.
ఆ సవాళ్లు దాటి..
వయసులో అభిమన్యు చాలా చిన్నవాడు కాబట్టి రాత్రుల్లో ఆలస్యంగా జరిగే టోర్నీల్లో నిద్రను ఆపుకోలేకపోయేవాడు. దీంతో ఓ సారి న్యూజెర్సీ ఓపెన్‌లో ఓటమి చెందాల్సి వచ్చింది. ఆ సమస్యను అధిగమించేందుకు చాలా కసరత్తులు చేశాడు. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ మాస్టర్ హోదా కోసం ఓ టోర్నీకి ముందు తన ఇంట్లో తండ్రితో కలిసి ముందుగానే అక్కడి కాలమానానికి అలవాటు పడేందుకు రాత్రుల్లో 3 గంటల వరకూ మేల్కోనే ఉన్నాడు. విమానాల్లో గంటల పాటు ప్రయాణించినప్పటికీ ఆ అలసట అనేది లేకుండానే పోటీల్లో విజయాలు సాధించడం అతనికి పరిపాటిగా మారింది.
ఆర్థిక సమస్యలు
ఈ క్రమంలోనే ఆర్థికంగానూ సమస్యలు ఎదురయ్యాయి. గ్రాండ్ మాస్టర్‌గా నిలిచేందుకు హంగేరీలో టోర్నీల కోసం అతని తండ్రి.. ఓ వెబ్సైట్ ద్వారా సుమారు రూ.11.91 లక్షల నిధులు సేకరించాడు. ఆ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న ప్రత్యర్థులను ఓడిస్తున్న అభిమన్యు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇదీ చదవండి: ప్రపంచ రికార్డుతో టోక్యో పారాలింపిక్స్‌కు దేవేంద్ర