Junior Hockey World Cup India vs Germany: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో వరుసగా రెండో సారి జయకేతనం ఎగరేయాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టు మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. ఆరు సార్లు ఛాంపియన్ జర్మనీతో శుక్రవారం సెమీస్‌లో తలపడుతుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో 4-5 తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓటమి తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఢిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. పటిష్ఠమైన డిఫెన్స్.. దూకుడైన అటాకింగ్.. మెరుగైన డ్రాగ్ ఫ్లికింగ్ సామర్థ్యంతో ప్రత్యర్థికి అడ్డుకట్ట వేయాలని జట్టు చూస్తోంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.
క్వార్టర్స్‌లో బలమైన బెల్జియంపై విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో జర్మనీపైనా ఆధిపత్యం చెలాయించేందుకు భారత జట్టు బరిలో దిగనుంది. బెల్జియంతో మ్యాచ్‌లో భారత్ డిఫెన్స్‌లో గొప్పగా రాణించింది. ముఖ్యంగా ఇద్దరు గోల్‌కీపర్లు ప్రశాంత్, పవన్ ప్రత్యర్థికి, గోల్‌పోస్టుకు మధ్యలో గోడలా నిలబడ్డారు. ఆ మ్యాచ్‌లో గెలుపు గోల్ చేసిన శార్దానంద్ తివారీపై మంచి అంచనాలున్నాయి. అతనితో పాటు సంజయ్, అరైజీత్ సింగ్, అభిషేక్ లక్రా పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేస్తే భారత్‌కు తిరుగుండదు.
ఇక సీనియర్ జట్టు తరపున టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన వివేక్ సాగర్ ఈ టోర్నీలో జూనియర్ బృందాన్ని గొప్పగా నడిపిస్తున్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఆడుతూ జట్టు మంచి ఫలితాలు సాధిస్తోంది. సెమీస్‌లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాల్సి ఉంది. కాగా, ప్రత్యర్థి జర్మనీ కూడా గట్టి పోటీనిచ్చేదే. క్వార్టర్స్‌లో ఆ జట్టు చివరి నిమిషంలో గోల్‌తో ఓటమి తప్పించుకుని మ్యాచ్‌ను షూటౌట్‌కు మళ్లించి గెలిచింది. ఎనిమిదేళ్ల తర్వాత మరో ప్రపంచ టైటిల్ అందుకునేందుకు ఆ జట్టు పోరాడుతోంది. చివరగా 2013లో అది విజేతగా నిలిచింది. మరో సెమీస్‌లో ఫ్రాన్స్‌తో అర్జెంటీనా ఢీ కొడుతుంది.