టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్రాత్మక కాంస్య పతకం సాధించిన భారత సీనియర్ జట్టే స్ఫూర్తిగా మన యువ ఆటగాళ్లు జూనియర్ ప్రపంచకప్‌లో(Junior Hockey World Cup 2021) బరిలో దిగబోతున్నారు. బుధవారం ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో(India vs France Hockey) తలపడనుంది. 2016లో లఖ్‌నవూలో జరిగిన ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శనతో టైటిల్ నెగ్గిన భారత్.. ఈసారి అదే జోరు ప్రదర్శించి కప్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకునేందుకు కుర్రాళ్లకు ఈ టోర్నీ మంచి అవకాశం. వివేక్‌సాగర్ ప్రసాద్(Vivek Sagar Prasad Hockey Player) నాయకత్వం వహిస్తున్న ఈ జట్టులో ప్రతిభావంతులకు కొదువలేదు. వారిలో వైస్ కెప్టెన్, డ్రాగ్ ఫ్లికర్ సంజయ్ కీలక ఆటగాడు. ఇప్పటికే సీనియర్ జట్టులో ఆడిన అనుభవం ఉన్న వివేక్ ప్రసాద్ లాంటి వారు ఉండడం జూనియర్ జట్టుకు సానుకూలాంశం. వివేక్ టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
16 జట్లు.. 4 పూల్స్:
16 జట్లు తలపడుతున్న ఈ ప్రపంచకప్‌లో పూల్-బిలో ఫ్రాన్స్, కెనడా, పొలాండ్‌తో భారత్ పోటీపడనుంది. ఫ్రాన్స్‌తో మ్యాచ్ తర్వాత నవంబర్ 25న కెనడాతో, 27న పోలెండ్‌తో మన బృందం ఆడనుంది. పూల్-ఏలో బెల్జియం, మలేసియా, చిలీ, దక్షిణాఫ్రికా, పూల్-సిలో నెదర్లాండ్స్, స్పెయిన్, కొరియా, యూఎస్‌ఏ, పూల్-డిలో జర్మనీ, పాకిస్థాన్, ఈజిప్ట్, అర్జెంటీనా ఉన్నాయి. ప్రతి పూల్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. కరోనా నేపథ్యంలో ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు బయో బుడగ వాతావరణంలో.. అభిమానులు లేకుండా జరగనున్నాయి. టోర్నీ తొలిరోజు భారత్-ఫ్రాన్స్‌తో పాటు దక్షిణాఫ్రికాతో బెల్జియం, చిలీతో మలేసియా, జర్మనీతో పాకిస్థాన్, కెనడాతో పోలెండ్ తలపడనున్నాయి.
"2016లో మా జట్టు ఛాంపియన్ అయింది. ఈసారి స్వదేశంలోనే జరుగుతున్న టోర్నీలో టైటిల్ నిలబెట్టుకోవాలని బరిలో దిగుతున్నాం" అని కెప్టెన్ వివేక్ ప్రసాద్ చెప్పాడు. "భారత బృందానికి గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ జట్లతో ఆడిన అనుభవం లేదు. అయితే భువనేశ్వర్‌లో సీనియర్ జట్టుతో ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌లు సరిపోతాయని భావిస్తున్నాం. ఈ టోర్నీ కోసం 20 మంది ప్రతిభావంతులను ఎంపిక చేశాం. వీరిలో ఇద్దరు ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా ఉన్నారు" అని టీమ్‌ఇండియా చీఫ్ కోచ్ గ్రాహం రీడ్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:
FIH Awards 2021: హాకీ అవార్డుల్లో భారత్ ఆధిపత్యం
హాకీ మ్యాచ్‌లో గోల్‌కీపర్‌గా సీఎం.. క్రీడా మంత్రికి చుక్కలు!