దేశంలో రాబోయే కొన్ని నెలల్లో పరిస్థితి మరింత తీవ్రమైతే అభిమానులు లేకుండానే మహిళల అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ప్రకటన చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు టోర్నీ జరగనుంది.
"కరోనా కారణంగా పరిస్థితి మరింత విషమిస్తే అండర్-17 ప్రపంచకప్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తాం. ఇలా చేయడం బాధాకరమే కానీ మనుషుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు" అని ఏఐఎఫ్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ చెప్పారు.
![under](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8015907_as.jpg)
ఈ టోర్నీ కోసం ఆగస్టులో శిబిరాన్ని నిర్వహించేందుకు ఝార్ఖండ్ ఆసక్తి ప్రదర్శిస్తోందని దాస్ తెలిపారు.
"శిబిరాల గురించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నాం. అండర్-17 జట్టులో తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు ఎనిమిది మందికిపైగా ఉండటం వల్ల ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తమ రాష్ట్రంలో శిబిరం నిర్వహించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆగస్టు 15లోగా ఈ శిబిరం మొదలు కావడం ఖాయం" అని దాస్ చెప్పారు.
ఇది చూడండి : ఆకాశ్ చోప్రా ప్రకారం బెస్ట్ ఫీల్డర్స్ వీరే!