ప్రతిష్ఠాత్మక ఐరోపా ఫుట్‌బాల్ సంఘాల కూటమి (యూఈఎఫ్‌ఏ)లో చీలిక ఏర్పడింది. ఇంగ్లాండ్, స్పెయిన్, ఇటలీకి చెందిన 12 ఎలైట్ క్లబ్బులు యూఈఏఫ్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించే ఛాంపియన్స్ లీగ్ నుంచి బయటకొచ్చి కొత్తగా సూపర్ లీగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఛాంపియన్స్ లీగ్ విస్తరణతో పాటు ఓపెన్ విధానం పట్ల వ్యతిరేకతతో ఉన్న 12 (ఇంగ్లాండ్‌కు చెందిన అర్సెనల్, చెల్సీ, లివర్‌పూల్, మాంచెస్టర్ సిటీ, మాంచెస్టర్ యునైటెడ్, టొటెన్‌హమ్, స్పెయిన్‌కు చెందిన అట్లెటికో మాడ్రిడ్, బార్సిలోనా, రియల్ మాడ్రిడ్, ఇటలీ క్లబ్బులు.. ఏసీ మిలన్, ఇంటర్ మిలన్, జువెంచస్) క్లబ్బులు యూఈఎఫ్‌ఏ నుంచి బయటకొచ్చి కొత్తగా సూపర్ లీగ్‌కు శ్రీకారం చుట్టాయి. ఫ్రాన్స్, జర్మనీ క్లబ్బులు అందులో చేరలేదు. 2024 నుంచి ఛాంపియన్స్ లీగ్‌ను 36 జట్లకు విస్తరించాలని యూఈఎఫ్‌ఏ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఓపెన్ విధానంలో జరిగే ఈ లీగ్‌లో జట్లు కిందిస్థాయిలో, దేశవాళీల్లో పోటీపడి అర్హత సాధించాల్సి ఉంటుంది.
ఎందుకు అలా?:
12 క్లబ్బులు కలిసి సూపర్ లీగ్‌ను తెరపైకి తీసుకురావడానికి ప్రధాన కారణం డబ్బు. సుదీర్ఘంగా సాగే ఛాంపియన్స్ లీగ్‌లో నెగ్గితే భారీగా నగదు బహుమతి వస్తుంది. కానీ సూపర్ లీగ్‌లో బరిలో దిగిన ప్రతి జట్టుకూ భారీ మొత్తంలో డబ్బు అందేలా లీగ్‌ను నిర్వహించనున్నారు. సూపర్ లీగ్‌లో ప్రతి జట్టుకూ గత ఛాంపియన్స్ లీగ్ విజేత దక్కించుకున్న దానికంటే మూడు రెట్లు అధికంగా అందనుంది.
ఇదీ చదవండి: ఫిట్‌నెస్‌లో అదే నా ప్లస్ పాయింట్: ధోనీ
సూపర్ లీగ్ ఎలా?
సూపర్ లీగ్ ఆరంభ సీజన్‌ను త్వరలోనే నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు 12 వ్యవస్థాపక క్లబ్బులతో పాటు మరో మూడు జట్లు లీగ్‌లో శాశ్వత సభ్యులుగా ఉంటాయి. ప్రతి ఏడాది వాటికి మరో ఐదు జట్లను జతచేసి మొత్తం 20 క్లబ్బులతో లీగ్ నిర్వహించనున్నారు. ఆ జట్లను రెండు గ్రూపులుగా విడదీసి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఒక్కో గ్రూపులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్ చేరతాయి. రెండు అంచెల్లో క్వార్టర్స్, సెమీస్ నిర్వహిస్తారు. అయితే అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడం వల్ల ఈ లీగ్ నిర్వహణకు అడుగుపడుతుందో లేదో చూడాలి.
ఎవరేమంటున్నారు?
ఈ లీగ్‌లో ఆడే జట్లు, ఆటగాళ్లను దేశవాళీ, ప్రపంచ పోటీల్లోకి అనుమతించబోమని, వాళ్లు న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యూఈఎఫ్‌ఏ హెచ్చరించినప్పటికీ ఆ క్లబ్బులు పెడచెవిన పెట్టాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్ విధానాలకు ఈ లీగ్ విరుద్ధంగా ఉందని పేర్కొన్న ఫిఫా దానికి అనుమతి ఇవ్వబోమని చెప్పింది. ఇది ఫుట్‌బాల్‌కు నష్టం కలిగిస్తోందని బ్రిటన్ ప్రధాని బోరిస్, దేశవాళీ ఆటకు చేటు చేస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. ఇది మోసమంటూ చెల్సీ, టొటెహమ్ అభిమానుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌ను నేనే.. జస్టిస్ దీపక్ వర్మ స్పష్టం