ముంబయి ఆశ నెరవేరింది! ఇండియన్ సూపర్ ఫుట్‌బాల్ లీగ్‌లో టైటిల్ గెలవాలన్న ఆ జట్టు కల తీరింది. మ్యాచ్ ఆఖర్లో బిపిన్ సింగ్ మెరుపు గోల్ చేయడం వల్ల ముంబయి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. శనివారం జరిగిన సీజన్-7 ఫైనల్లో ఆ జట్టు 2-1 గోల్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ ఏటీకే మోహన్‌బగాన్‌ను ఓడించింది. తమ ఆటగాడే ప్రత్యర్థికి గోల్ ఇవ్వడం.. ఆఖర్లో దురదృష్టం వెంటాడడంతో మోహన్‌బగాన్‌కు నిరాశ తప్పలేదు.
అయితే ఈ పోరు ఆరంభంలో ఏటీకేదే జోరు. 18వ నిమిషంలో డేవిడ్ విలియమ్స్ కొట్టిన గోల్‌తో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ, కొద్దిసేపటికే మోహన్‌బగాన్‌కు షాక్ తగిలింది. ప్రత్యర్థి కొట్టిన బంతిని ఆపే క్రమంలో ఏటీకే ఆటగాడు జోస్ లూయిస్ (29వ నిమిషం) తమ సొంత గోల్ పోస్టులోకి బంతిని పంపేయడం వల్ల స్కోరు సమమైంది. దాదాపు మ్యాచ్ ఆఖరి వరకు మరో గోల్ పడకపోవడం వల్ల పోటీ అదనపు సమయానికి మళ్లేలా కనిపించింది.
కానీ, 90వ నిమిషంలో బిపిన్‌సింగ్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఒజ్‌బెచె అందించిన పాస్‌ను నెట్‌లోకి పంపిన అతడు ముంబయికి 2-1తో ఆధిక్యాన్ని అందించాడు. స్కోరు సమం చేయడానికి మోహన్‌బగాన్ తీవ్రంగా ప్రయత్నించి విఫలం కావడం వల్ల ముంబయి గెలుపు సంబరాలు చేసుకుంది. ఐగర్ (14 గోల్స్, గోవా)కు బంగారు బూట్, అరిందమ్ భట్టాఛార్య (ఏటీకే)కు బంగారు గ్లోవ్ అవార్డులు లభించాయి.
ఇదీ చూడండి: డోప్ టెస్టుల్లో ఇద్దరు ఒలింపిక్స్ అథ్లెట్లు విఫలం