కరోనా నేపథ్యంలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌ను ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. నవంబరు నుంచి మార్చి వరకు లీగ్ జరగనుంది. ఆతిథ్య రేసులో గోవా, కేరళ ముందున్నాయి.
విదేశీ ఆటగాళ్ల నిబంధనలోనూ ఐఎస్‌ఎల్ స్వల్ప మార్పులు చేసింది. 2021-22 సీజన్ నుంచి విదేశీ ఆటగాళ్ల సంఖ్యను 3+1కు తగ్గించింది. ప్రస్తుత నిబంధన ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ ఏడుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. గరిష్ఠంగా ఐదుగురు మ్యాచ్‌లో ఆడొచ్చు. సవరించిన నిబంధన ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. అందులో ఓ ఆసియా ఆటగాడు కచ్చితంగా ఉండాలి. మైదానంలో బరిలో దిగే నలుగురు విదేశీయుల్లో ఆసియా ఆటగాడు తప్పనిసరి.