భారత ఫుట్‌బాల్ ఆటగాడు సీకే వినీత్ కాల్ సెంటర్ ఉద్యోగిగా మారాడు. కేరళకు చెందిన ఈ మిడ్‌ఫీల్డర్ జాతీయ జట్టు తరపున ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ సూపర్ లీగ్ (2019-20)లో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ తరపున ఆడాడు. మరి ఇలాంటి ఆటగాడు కాల్ సెంటర్లో చేరడమేంటి అనే అనుమానం రావడం సహజం. అయితే అతను ఆ పని చేస్తుంది ప్రజల ప్రాణాల కోసమే. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం ప్రజలకు సూచనలు, సలహాలు అందించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లోనే అతను ప్రస్తుతం పనిచేస్తున్నాడు.
"నేను కేరళ వచ్చిన తర్వాత రాష్ట్ర స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్లు నన్ను ఫోన్లో సంప్రదించారు. కన్నూర్‌లో ఏర్పాటు చేసిన కరోనా హెల్ప్‌లైన్ సెంటర్లో పనిచేస్తారా అని అడిగారు. వెంటనే ఒప్పుకున్నా. ఇదివరకు రోజుకు 150 కాల్స్ వరకూ వస్తుండేవి. ఇప్పుడా సంఖ్య చాలా తగ్గింది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. వైరస్ పూర్తిగా తగ్గేంతవరకూ ఇళ్లలోనే ఉండాలని ప్రజలను కోరుతున్నా" అని 31 ఏళ్ల వినీత్ తెలిపాడు.
ఇదీ చూడండి.. ఆన్‌లైన్‌లో పోటీలకు అథ్లెట్లు ఇంటి నుంచే సై!