కరోనా వైరస్ కారణంగా క్రీడలు రద్దవ్వడం వల్ల ఆటగాళ్లు తమ కుటుంబంతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. కొంతమంది క్రీడాకారులు మాత్రం తమ అభిమానులకు సమయాన్ని కేటాయిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వారు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తున్నారు.
తాజాగా భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి.. ట్విట్టర్‌లో ప్రశ్న-జవాబుల సెషన్‌లో పాల్గొన్నాడు. ఫుట్‌బాల్‌లో ఎన్నో రికార్డులు సాధించిన అతడిని ఐపీఎల్‌లో ఏ జట్టు తరఫున ఆడతావని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. "నేను బెంగళూరు యువకుడిని. ఏ జట్టుకు ఆడతానో అర్థమై ఉంటుంది" అని సమాధానమిచ్చాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో ఛెత్రి బెంగళూరు ఎఫ్‌సీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఆర్‌సీబీ తరఫునే ఆడతానిని పరోక్షంగా చెప్పాడు.
క్యారమ్స్‌లో ఓడిస్తాను..
ఫుట్‌బాల్‌లో కాకుండా మెస్సీ, రొనాల్డోను ఏ క్రీడల్లో అధిగమిస్తావని మరో నెటిజన్ అడిగాడు. "క్యారమ్స్‌లో వారు అంతగా రాణించరని అనుకుంటున్నా. దీనిలో వారిద్దరినీ అధిగమించగలను" అని ఛెత్రి సరదాగా బదులిచ్చాడు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో గత అయిదు రోజుల నుంచి బయటకు వెళ్లకుండా తన భార్యతో కలిసి ఇంట్లోనే ఉంటున్నానని తెలిపాడు.
ఇదీ చూడండి.. లైంగిక వేధింపుల ఆరోపణలతో క్రికెట్ కోచ్ సస్పెండ్