యూరో 2020 ఫుట్‌బాల్(Euro 2020 FootBall) టోర్నీలో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. 55 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ ప్రధాన టోర్నీ ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్.. వరుస విజయాలతో జోరుమీదున్న ఇటలీతో తుదిపోరులో తలపడనుంది. మొట్టమొదటి యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకోవాలనే పట్టుదలతో ఇంగ్లిష్ జట్టు ఉండగా.. ఈ టోర్నీలో రెండోసారి విజయదుందుభి మోగించాలనే లక్ష్యంతో ఇటలీ జట్టు ఉంది. బలాబలాల్లో రెండు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి.
ఇంగ్లాండే ఫెవరేట్..
సొంతగడ్డపై.. స్థానిక అభిమానుల మద్దతుతో మైదానంలో అడుగుపెట్టబోతున్న ఇంగ్లాండే(England Football Team) ఈ ఫైనల్లో ఫేవరేట్‌గా కనిపిస్తోంది. అన్ని విభాగాల్లోనూ ఆ జట్టు పటిష్ఠంగా ఉంది. 1966 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన తర్వాత ఇంగ్లాండ్ ఓ ప్రధాన టోర్నీ ఫైనల్ చేరడమిదే తొలిసారి. యూరో కప్‌లో ఆ జట్టుకిదే తొలి ఫైనల్. కెప్టెన్ హ్యారీ కేన్, రహీమ్ స్టెర్లింగ్, డిఫెండర్లు.. మెగ్వాయోర్, లూక్ షా, జాన్ స్టోన్స్, గోల్‌కీపర్ జోర్డాన్ లాంటి అత్యుత్తమ ఆటగాళ్లతో ఇంగ్లాండ్‌కు మెరుగైన అవకాశాలున్నాయి.
ఇటలీ తక్కువేం కాదు..
1968లో యూరో కప్‌లో విజేతగా నిలిచిన ఇటలీ(Italy Football Team).. మరోసారి టైటిల్‌ను దక్కించుకోవాలనే ధ్యేయంతో ఉంది. 2000, 2012లో ఆ జట్టు ఫైనల్ చేరినా.. చివరి మెట్టుపై బోల్తాపడి నిరాశ చెందింది. 2018 ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో విఫలమైన ఇటలీ.. ఆ పరాభవం నుంచి పాఠాలు నేర్చుకుని తిరుగులేని జట్టుగా మారింది. గత 33 మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు ఓటమే ఎదురు కాలేదు. ప్రధాన టోర్నీల్లో ఇంగ్లాండ్ చేతిలో ఇటలీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అసాధారణ వేగంతో.. ప్రత్యర్థి అంచనాలకు అందకుండా.. కౌంటర్ అటాక్ చేయడమే బలంగా మార్చుకున్న ఈ ఇటలీ జట్టు జోరు మీదుంది. లోరెంజో, సిరో, ఫెడెరికోలతో కూడిన ఫార్వర్డు త్రయం ప్రత్యర్థికి కఠిన సవాలు విసరగలదు. కెప్టెన్ చీలిని కూడా ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడగా ఇటలీ 11, ఇంగ్లాండ్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
ఇదీ చదవండి: ఇకపై రెండేళ్లకోసారి ఫిఫా ప్రపంచకప్!