కివీస్ కల తీరింది.. న్యూజిలాండ్ విశ్వ విజేతగా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా వన్డేలు, టీ20ల్లో ప్రపంచకప్ అందుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ఆ జట్టు.. ఎట్టకేలకు టెస్టుల్లో ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో(WTC) విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఒక్కసారి ఛాంపియన్స్ ట్రోఫీ (2000)ని సొంతం చేసుకోవడం మినహా ఐసీసీ టోర్నీల్లో గెలిచిన రికార్డు లేని ఆ జట్టు.. సుదీర్ఘ నిరీక్షణకు ఈ విజయంతో ముగింపు పలికింది. 1975 నుంచి వన్డే ప్రపంచకప్‌లో(WORLD CUP) పోటీపడుతోన్న ఆ జట్టు.. ఇప్పటికే 12 సార్లు ఆ మెగా టోర్నీ బరిలో దిగింది. గత రెండు సార్లు (2015, 2019) విజేతగా నిలిచేలా కనిపించింది. కానీ ఫైనల్ గండాన్ని దాటలేకపోయింది.
మరీ ముఖ్యంగా గత ప్రపంచకప్‌లో ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. ఇంగ్లాండ్‌తో తుదిపోరులో మ్యాచ్ స్కోర్లు సమం కాగా.. సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. దీంతో బౌండరీల తేడాతో ప్రత్యర్థిని విజేతగా ప్రకటించడం వల్ల కివీస్‌పై క్రికెట్ ప్రపంచం జాలి చూపింది. మరోవైపు టీ20 ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. సుదీర్ఘ ఫార్మాట్ విషయానికి వస్తే.. 1930లో టెస్టు హోదా దక్కించుకున్న ఆ జట్టు అదే ఏడాది ఇంగ్లాండ్‌తో తన మొట్టమొదటి మ్యాచ్ ఆడింది. దశాబ్దాల నుంచి టెస్టుల్లో కొనసాగుతున్నప్పటికీ ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చలాయించలేకపోయింది. గత కొన్నేళ్లలో ఆ జట్టు గణనీయమైన ప్రగతి సాధించింది. విలియమ్సన్ సారథిగా బాధ్యతలు చేపట్టాక ఆ జట్టు రాతే మారిపోయింది. ఈ ఏడాది జనవరిలో తొలిసారి టెస్టుల్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఆ స్థానంలోనే కొనసాగుతోంది.